కన్న కూతురిని చంపి తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడగా.. వారి అంత్యక్రియలను బెంగాల్‌లోని బాధిత కుటుంబ సభ్యులు వీడియో కాల్ ద్వారా వీక్షించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోపీనాథ్, సమత దంపతులు తమ 23 నెలల కుమార్తె స్నిగ్ధతో కలిసి నివాసం ఉంటున్నారు. ఏమైందో తెలియదు కానీ, బుధవారం ఈ దంపతులతో పాటు చిన్నారి కూడా ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. గమనించిన అపార్ట్మెంట్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
అక్కడ గోపీనాథ్ రాసిన సూసైడ్ నోట్ లభించడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. “స్నిగ్ధ, సమత వెళ్లిపోయారు.. నేను కూడా వెళ్లిపోతున్నా” అని లేఖలో గోపీనాథ్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి గోపీనాథ్ సోదరులకు అప్పగించారు. దీంతో వారు లోయర్ ట్యాంక్‌బండ్ సమీపంలోని శ్మశానవాటికలో గోపీనాథ్ దంపతులతో పాటు చిన్నారికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ అంత్యక్రియలను బెంగాల్లో ఉన్న దంపతుల తల్లిదండ్రులు వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూసి బోరున విలపించారు.
ఈ దంపతుల గురించి పోలీసులు అపార్ట్మెంట్ వాసులను విచారించగా వెల్లడైన విషయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, పాపను కూడా ప్రాణంగా చూసుకునేవారని స్థానికులు తెలిపారు. చిన్నారిని తాను రోజూ పార్కుకు తీసుకెళ్లేవాడినంటూ ఎదురింట్లో ఉండే వృద్ధుడు కన్నీటిపర్యంతమయ్యాడు. వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదని, వారి ఆత్మహత్యకు మరేదైనా కారణం ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read
- చిన్నారి సహా భార్యభర్తలు మృతి.. దహన సంస్కారాలను వీడియో కాల్లో వీక్షించిన తల్లిదండ్రులు!
- పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం.. కట్‌చేస్తే..
- GITAM University: యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్





