SGSTV NEWS online
CrimeTelangana

పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలో పుస్తెల తాడు చోరికి యత్నం.. కట్‌చేస్తే..



ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు అమాయకులనే టార్గెట్‌గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో పొలంలో పనిచేస్తున్న ఓ మహిళను టార్గెట్‌గా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు, ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. గమనించిన స్థానిక రైతులు వారిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.


పొలంలో పనిచేస్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లేందుకు ఇద్దరు కేటుగాళ్లు ప్రయత్నించిన ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. హత్నూర, జిన్నారం మండలాల సరిహద్దుల్లో ఈ ఘటన జరిగింది. సోలక్‌పల్లికి చెందిన కిష్టమ్మ అనే మహిళ రోజూలాగే పొలానికి వెళ్లి అక్కడ పనిచేసుకుంటోంది. అయితే పొలంలో ఒంటరిగా ఉన్న మహిళను చూసిన కేటుగాళ్లు, ఎలాగైనా ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును కాజేయాలని ప్లాన్ చేశారు.


పథకం ప్రకారం మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి దారి అడుగుతున్నట్లు నటించారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి, మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడును లాక్కుని బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. బాధితురాలు కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానిక రైతులు ఆ దొంగలను వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వారిని చితకబాది, వారి వద్ద నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అప్పగించారు.

వెంటనే రైతులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వడ్డే సాయిలు, మీనంపల్లి అరవింద్‌గా గుర్తించారు. వీరిపై ఇప్పటికే నాలుగుకు పైగా కేసులు ఉన్నట్టు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

also read

Related posts