రాష్ట్ర రాజధాని పరిధిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మిఠాయి తయారీ, విక్రయ కేంద్రాలపై తెలంగాణ ఆహార, నిత్యావసర ఔషధ ప్రమాణాల ప్రాధికార సంస్థ (TG SAFE ఎన్ఫోర్స్మెంట్ విభాగం), హైదరాబాద్ నగర పోలీసు బృందాలు కొరడా ఝుళిపించాయి. సంయుక్తంగా 13 బృందాలుగా ఏర్పడిన అధికారులు క్యూర్ (CURE) రీజియన్‌లోని 16 ప్రముఖ స్వీట్ మాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. అత్యంత అధ్వానమైన అపరిశుభ్ర వాతావరణం, ఎలుకల మల విసర్జనలు (Rat Feces), బొద్దింకలు, ఈగల మధ్య ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలను బేఖాతరు చేసిన 5 దుకాణాలను అధికారులు తక్షణమే మూసివేయించగా (సీజ్), మరో 5 ప్రముఖ సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులను రద్దు చేసి వ్యాపార కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.మొత్తం రు 16,86,018 విలువేనా 3,546.5 కోలోల నాణ్యతలేని, గడువు ముగిసిన ఆహార నిల్వలను సీజ్ చేసి నాశనం చేశారు. అనుమానం ఉన్న 22 ఆహార నమూనాలను ల్యాబ్ పరీక్షల నిమిత్తం సేకరించారు.
లైసెన్సులు సస్పెండ్ అయిన 5 ప్రముఖ సంస్థలు
ప్రజారోగ్య భద్రత దృష్ట్యా కింది సంస్థల లైసెన్సులను రద్దు చేస్తూ వ్యాపార కార్యకలాపాలను తక్షణమే ఆపాలని అధికారులు ఆదేశించారు
* జి. పుల్లా రెడ్డి స్వీట్స్ (సనత్‌నగర్): సరైన కేటగిరీ లైసెన్స్ లేకపోవడం, ప్రాంగణంలో ఎలుకల మల విసర్జనలు, కుళ్లిన కూరగాయలు, అపరిశుభ్ర వాషింగ్ ప్రాంతాలు, గడువు ముగిసిన ఆహారాలు. ఇక్కడ ఒక్కచోటే రూ. 15,03,582 విలువైన 3,133 కిలోల ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
* ఆగ్రా మిఠాయి ఘర్ రెస్టారెంట్ (చార్‌కమాన్, చార్మినార్): తప్పుడు కేటగిరీ లైసెన్స్, ఎలుకలు-ఈగల సంచారం, గడువు ముగిసిన, లేబుల్స్ లేని నిల్వలు, మిఠాయిలకు న్యూస్‌పేపర్లు వాడటం.
* హిరానీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ / మినర్వా స్వీట్స్ (కాటేదాన్): నిల్వ ఉంచిన స్టోరేజ్ ప్రాంతమంతా ఎలుకల విసర్జనలు, జిడ్డు కారే గోడలు, తుప్పు పట్టిన పరికరాలు, సిబ్బందికి ఆప్రాన్లు-షూ కవర్లు లేకపోవడం.
* స్వీటోన్ రుచులు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (వనస్థలిపురం): స్టోరేజ్ గదిలో ఎలుకల మల విసర్జనలు, తప్పుడు లేబుళ్లు, విరిగిన టైల్స్ మధ్య నిలిచిన మురుగునీరు, దుర్గంధభరితమైన కార్మికుల వాష్‌రూమ్‌లు.
* బాలాజీ శ్రీ కిషన్ మిఠాయి భండార్ (షంషీర్ గంజ్, ఫలక్‌నుమా): నిబంధనలకు విరుద్ధమైన లైసెన్స్, జిడ్డుతో నల్లబడిన వంటగది గోడలు, పాత్రల శుభ్రతకు ప్రత్యేక స్థలం లేకపోవడం, లేబుల్స్ లేని ఫేణీ కార్టన్లు.
షోకాజ్ నోటీసులు.. భారీ జరిమానాలు
మొత్తం ఏడు సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూసివేసిన 5 సంస్థలతో పాటు సనత్‌నగర్‌లోని ‘భారత్ బక్లావా’, తిమ్మాపూర్ (రంగారెడ్డి జిల్లా)లోని ‘కరాచీ బేకరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ లకు నోటీసులు ఇచ్చి, భారీ జరిమానాలు విధించేందుకు చర్యలు చేపట్టారు. అలాగే హిమాయత్‌నగర్‌లోని శ్రీ శగున్ మిఠాయి వాటికకు లోపాలను సరిదిద్దుకోవాలని ‘ఇంప్రూవ్మెంట్ నోటీసు’ జారీ చేశారు. త్వరలోనే పునఃపరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠిన చర్యలు:
లైసెన్సులు లేకుండా నడపడం, ఆహార పదార్థాలపై విషపూరిత సిరా ఉండే న్యూస్పేపర్లను కప్పడం, ఎలుకలు-కీటకాల నియంత్రణ పాటించకపోవడం చట్టరీత్యా తీవ్ర నేరమని అధికారులు స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ తయారీ కేంద్రాలు నిబంధనలు పాటించకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Also read
- GITAM University: యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం.. ఈగిల్ ఫోర్స్ విచారణ
- Raids: ఎలుకల విసర్జనలు, బొద్దింకల మధ్య స్వీట్ల తయారీ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు..
- Minor Girl Abused: మైనర్ బాలికపై ఏళ్ల తరబడి అఘాయిత్యం: తల్లి సహా నలుగురి అరెస్ట్
- హైదరాబాద్ : అర కేజీ బంగారం, 1.5 కిలోల వెండి చోరీ
- మారేడుపల్లి పోలీసుల చాకచక్యంతో భారీ చోరీ ఛేదన





