హైదరాబాద్‌లో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయాలపై ఈగల్ ఫోర్స్, కుషాయిగూడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సైనిక్‌పురిలోని ‘ది స్మోక్ షాప్’పై జరిపిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని, 39 నిషేధిత ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన ఉబైస్ (20), ఉస్సైనార్ పీహెచ్ (19)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వాట్సాప్ ద్వారా ఆర్డర్లు.. రాపిడో ద్వారా డెలివరీలు
ప్రాథమిక దర్యాప్తులో ఈ-సిగరెట్ల సరఫరా వెనుక బెంగళూరుకు చెందిన అర్షద్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్సాప్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, ఫోన్‌పే ద్వారా చెల్లింపులు తీసుకున్నారు. రాపిడో ద్వారా వినియోగదారులకు ఈ-సిగరెట్లు పంపినట్లు విచారణలో వెల్లడైంది. ఆగస్టు 3 నుంచి 26 డెలివరీలకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో సుమారు 45 మంది వినియోగదారులు ఈ-సిగరెట్లు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
రూ.10 కోట్ల లావాదేవీలపై దర్యాప్తు!
ఈ వ్యవహారంలో రూ.10 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు వచ్చిన సమాచారంతో సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల పాత్రను అధికారులు పరిశీలిస్తున్నారు. నిషేధిత వేప్స్ విక్రయాలపై గత రెండు నెలల్లో ఈగల్ ఫోర్స్ ఏడు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ-సిగరెట్ల సరఫరా, విక్రయాల్లో మరెవరైనా ఉన్నారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. యువతకు నిషేధిత ఉత్పత్తులు చేరకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Also read
- అన్న కోసం ప్రాణత్యాగం చేసిన చెల్లి- పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర ఇదే
- అక్టోబర్ 28న అట్లతద్ది- 11 అట్లు వాయనం ఇవ్వడం వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
- అట్లతద్ది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ మహిళపై లైంగిక దాడి




