Seebi Narasimha Swamy Temple History : సాధారణంగా ఆలయాల్లో కనువిందు చేసే దివ్యమంగళ స్వరూపాలు కనిపిస్తాయి. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం విగ్రహానికి బదులుగా కేవలం ఒక శిల మాత్రమే పూజలందుకుంటుంది. అయినా సరే ఆ స్వామి మహిమను నమ్మి భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలివస్తారు. మనసులోని కోరికలను ఆ శిలకే విన్నపించుకుని, మనసారా పూజిస్తుంటారు. పెళ్లి కావడం ఆలస్యమవుతున్నవాళ్లు ఇక్కడ నిర్వహించే కల్యాణోత్సవంలో పాల్గొంటే త్వరగా వివాహం నిశ్చయమవుతుందని నమ్ముతారు. ఇంతకీ, ఆ పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏంటి? ఎక్కడ ఉంది? దాని వెనుక ఉన్న పురాణ గాథలను ఇప్పుడు తెలుసుకుందాం.
నరసింహస్వామి దేవాలయం అనగానే లక్ష్మీదేవి సమేతంగా, ఉగ్రరూపంతో కనిపించే ప్రహ్లాదవరదుడి రూపమే మన కళ్ల ముందు మెదులుతుంది. కానీ, ఈ టెంపుల్లో అలాంటి దృశ్యమేది కూడా కనిపించదు. అందుకు బదులుగా, గర్భాలయంలో శివలింగాన్ని పోలిన ఓ సాలగ్రామ శిల మాత్రమే దర్శనమిస్తుంది. అందులోనే నరమృగశరీరుడి తేజస్సు నిక్షిప్తమై ఉంటుంది. అదే, కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా, సిరా తాలూకా, సీబి గ్రామంలోని “సీబి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం”. వామనావతారంలో ఉన్నప్పుడు తనకు 3 అడుగుల నేలను దానమిచ్చిన శిబి చక్రవర్తిని అనుగ్రహించేందుకు నరసింహస్వామి ఇక్కడ స్వయంభువుగా వెలిశారని స్థానిక ఐతిహ్యం.
స్థలపురాణం ఏం చెబుతుందంటే?
పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఈ ప్రదేశం శిబి చక్రవర్తి వానప్రస్థ ఆశ్రమంగా ఉండేదట. ఒకసారి శిబి ప్రార్థనను మన్నించి నరసింహస్వామి ఇక్కడ సాలగ్రామ రూపంలో స్వయంభువుగా వెలిశారట. ఇది జరిగిన కొన్నాళ్లకు ఓ వర్తకుడు తన అనుచరులతో కలిసి ఎడ్లబండిమీద ధాన్యాన్ని తీసుకెళ్తూ ఈ ప్లేస్‌లో విశ్రాంతి తీసుకునేందుకు ఆగాడట. కాసేపటికి ఇక్కడే ఉన్న ఓ పెద్ద బండరాయిపైన పాత్రను ఉంచి, అన్నం వండడానికి ట్రై చేస్తే, ఆ గిన్నెలోని బియ్యం ఎరుపురంగులోకి మారిపోయాయట. అది చూసి ఆ వ్యాపారి అతడి అనుచరులూ భయపడి స్పృహతప్పి పడిపోయారు.
అప్పుడు నరసింహస్వామి వర్తకుడికి కలలో కనిపించి, ఆ శిల తన నివాసస్థానమని చెబుతూనే, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా తనకోసం ఓ చిన్న టెంపుల్‌ను నిర్మించమని ఆదేశించాడట. కాసేపటికి వర్తకుడు తేరుకుని, స్వామి చెప్పినట్లుగానే దేవాలయాన్ని నిర్మించి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ ఆస్థానంలో దివాన్‌గా పనిచేసిన కచేరి కృష్ణప్ప కొడుకులైన లక్ష్మీ నరసప్ప, పుట్టణ్ణ, ఫౌజ్దార్ నల్లప్పలు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ టెంపుల్‌ను డెవలప్ చేశారట. అయితే, దీన్ని పునర్నిర్మించేందుకు దాదాపు పది సంవత్సరాలు పట్టిందని స్థానిక చరిత్ర ద్వారా తెలుస్తోంది.
ఘనంగా కల్యాణోత్సవం :
ఈ ఆలయాన్ని ద్రావిడ నిర్మాణశైలితో మూడు అంతస్తుల రాజగోపురంతో నిర్మించారు. ఇది చూడడానికి చిన్నదే అయినా పైకప్పులూ, గోడలపైనా రామాయణ, మహాభారత, భాగవత ఇతివృత్తాలకు సంబంధించిన వర్ణచిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. అవన్నీ చూసుకుంటూ ముందుకు సాగే భక్తులకు గర్భగుడిలో సాలగ్రామ శిల రూపంలో అవతరించిన నరసింహస్వామి దర్శనమిస్తాడు. ఆ శిలకే పూజలు, అభిషేకాలనూ నిర్వహిస్తారు అర్చకులు. ఇక, స్వామివారి దేవేరి అయిన లక్ష్మీదేవి ఇక్కడ లోకాంబగా పూజలు అందుకుంటోంది. వివాహంకానివారు ఈ అమ్మవారిని పూజించి, ఇక్కడ ఏటా నిర్వహించే కల్యాణోత్సవంలో పాల్గొంటే త్వరగా పెళ్లి అవుతుందని చెబుతారు.
ఈ ప్రాంగణంలో గజ పుష్కరిణి అనే పేరుతో కోనేరు ఉంది. రోజూ స్వామివారికి నిర్వహించే పూజలే కాకుండా, ప్రతి సంవత్సరం మాఘమాసంలో ఏడురోజులపాటు అంగరంగవైభవంగా రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది చూసేందుకు ఏపీ, తెలంగాణలతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ టైమ్‌లో ఆ రథాన్ని ఊరంతా ఊరేగించే తీరును చూసి తీరాల్సిందే. అలాగే, వైశాఖమాసంలో వచ్చే నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి నిర్వహించే ప్రత్యేక పూజలను చూడడానికి రెండుకళ్లూ చాలవు. ఇంకా నరసింహస్వామితోపాటు రాముడు, కృష్ణుడు, వినాయకుడు తదితర దేవతామూర్తులను కూడా ఈ పుణ్యక్షేత్రంలో దర్శించుకోవచ్చు.
ఎలా చేరుకోవాలంటే?
విమానంలో ఈ టెంపుల్‌కు రావాలనుకునే భక్తులు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాలి. అక్కడినుంచి దాదాపు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చేరుకునేందుకు బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి. ట్రైన్లో రావాలనుకుంటే తుమకూరు రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది.
