శిమృత్యుంజయుడిగా పేరొందిన పరమేశ్వరుడు ఓ క్షేత్రంలో రోగనాశకుడిగా కొలువై ఉన్నాడు. ఆ క్షేత్రం ఎక్కడ ఉంది? ఆ క్షేత్ర స్థల పురాణం, విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Unkeshwar Mahadev
సాధారణంగా పరమేశ్వరుని లయకారుడని అంటారు. కానీ తనను ఆశ్రయించిన భక్తుల మృత్యు భయాలు పోగొట్టే భోళాశంకరుడు పరమేశ్వరుడు. ‘శివమ్’ అనే పదానికి ‘శుభం’ అని అర్ధం. శివుణ్ణి ఆశ్రయిస్తే సకల శుభాలు చేకూరుతాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శివపురాణంలో వివరించి ఉంది. మృత్యుంజయుడిగా పేరొందిన పరమేశ్వరుడు ఓ క్షేత్రంలో రోగనాశకుడిగా కొలువై ఉన్నాడు. ఆ క్షేత్రం ఎక్కడుంది? క్షేత్ర విశేషాలేమిటో విపులంగా తెలుసుకుందాం.
శ్రీ ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం – ఉన్కేశ్వర్, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, కిన్వట్ తాలూకాలో, మాండ్వి అటవీ ప్రాంతానికి సమీపంలో వెలసిన ఈ పవిత్ర క్షేత్రం మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంత భక్తులకు ఎంతో సుపరిచితం. ఇక్కడ కొలువైన పరమశివుడిని దర్శించుకోవడంతో పాటు, ఆలయ సమీపంలోని సహజ వేడినీటి సరోవరాన్ని సందర్శించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పునీతమైన ఈ క్షేత్ర స్థల పురాణం గురించిన విశేషాలు చూద్దాం.
శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన శివలింగం
ఉన్కేశ్వర్ క్షేత్రం స్థల పురాణం ప్రకారం, శ్రీరాముడు వనవాస సమయంలో సీతాదేవి, లక్ష్మణస్వామితో కలిసి ఈ దండకారణ్య ప్రాంతంలో సంచరించినప్పుడు ఉన్కేశ్వర్ ప్రాంతానికి కొంతకాలం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో శర్భంగ మహర్షి అనే రుషి తీవ్రమైన చర్మవ్యాధితో బాధపడుతున్నప్పటికీ, నిరంతరం శ్రీరామనామాన్ని జపిస్తూ ఉండేవాడట. రామచంద్రుని దర్శించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ, తన అనారోగ్యం, రోగం కారణంగా ఏర్పడిన వికృత రూపం కారణంగా రాముని కలవడానికి సంకోచించాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
శ్రీరాముడు సృష్టించిన ఉష్ణగుండం
తన భక్తుడైన శర్భంగ మహర్షి బాధను గ్రహించిన శ్రీరాముడు తన దివ్యశక్తితో రెండు బాణాలను సంధించాడని అంటారు. అందులో ఒక బాణం ద్వారా వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే వేడినీటి సరోవరం ఏర్పడగా, మరొక బాణం ద్వారా మహా శివలింగం ప్రతిష్ఠితమైందని భక్తులు విశ్వసిస్తారు.
రోగ విముక్తి పొందిన శర్భంగ మహర్షి
శ్రీరాముని ఆదేశం మేరకు శర్భంగ మహర్షి ఆ వేడినీటి సరోవరంలో స్నానమాచరించి, శివలింగాన్ని పూజించడంతో తన వ్యాధుల నుంచి విముక్తి పొందాడని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఆనాటి నుంచి ఈ క్షేత్రం రోగనాశకుడైన ఉన్కేశ్వర మహాదేవుని దివ్యధామంగా ప్రసిద్ధి చెందింది.
సహజ వేడినీటి సరోవరం – ప్రత్యేక ఆకర్షణ
ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఇక్కడ సహజంగా ఏర్పడి ఉన్న ఉష్ణగుండం. ఏడాది మొత్తం ఈ గుండంలో నీరు సల సల కాగుతూ ఉంటాయి. ఈ నీటిలో సల్ఫర్ వంటి ఖనిజ పదార్థాలు ఉండవచ్చని, వాటి వల్ల కొన్ని చర్మ సమస్యలకు ఉపశమనం కలగవచ్చని కొందరు శాస్త్రవేత్తలు చెబుతారు. ఏది ఏమైనప్పటికి చర్మవ్యాధులతో బాధపడేవారు ఇక్కడికి వచ్చి స్నానమాచరించి, స్వామివారిని దర్శించిన తరువాత తమ రోగాల నుంచి విముక్తి పొందడం విశేషం. అంతేకాదు ఈ ఆలయానికి అనుబంధంగా ప్రకృతి వైద్య సేవలు అందించే ఆశ్రమం కూడా ఉంది. చర్మవ్యాధులకు ఉపశమనం కలిగిస్తుందని విశ్వసించే వేడినీటి సరోవరం, భక్తులకు ఉచితంగా ప్రకృతి వైద్య సేవలు అందించే ఆశ్రమం! ఇవన్నీ కలగలిసిన ఒక విశిష్టమైన శైవక్షేత్రమే మహారాష్ట్రలోని ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం!
అహల్యాబాయి హోల్కర్తో అనుబంధం
భారతదేశంలోని అనేక పవిత్ర క్షేత్రాల్లో దేవాలయాలు, బావులు, నీటి కుంటలు, యాత్రికుల విశ్రాంతి సదుపాయాల నిర్మాణానికి కృషి చేసిన మహనీయురాలు రాణి అహల్యాబాయి హోల్కర్. అదేవిధంగా ఉన్కేశ్వర్ ఆలయ నిర్మాణం, ఆలయ అభివృద్ధితోనూ ఆమెకు సంబంధం ఉందని విశ్వాసం. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి.
నిత్యపూజలు – పండుగల వైభవం
ఉన్కేశ్వర్ మహాదేవుని ఆలయంలో పరమశివునికి నిత్య పూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం అభిషేకాలు జరుగుతాయి. శ్రావణ మాసం, కార్తీక మాసం, మహాశివరాత్రి, శ్రీరామనవమి, దత్తజయంతి, వినాయక చవితి వంటి పర్వదినాలను ఇక్కడ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఉత్సవాలు – వేడుకలు
మహాశివరాత్రి, దత్తజయంతి సందర్భాల్లో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. మహారాష్ట్రతో పాటు తెలంగాణ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయానికి వచ్చే భక్తులకు, అక్కడ ఆశ్రయం పొందే వారికి అన్నదానం నిర్వహించడం ఈ క్షేత్రంలోని సేవా కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకతగా నిలుస్తోంది.
ఎలా చేరుకోవాలి?
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, కిన్వట్ తాలూకాలో వెలసి ఉన్న శ్రీ ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం ఆదిలాబాద్ నుంచి సుమారు 56 కిలోమీటర్లు, నాందేడ్ నుంచి సుమారు 124 కిలోమీటర్లు దూరంలో ఉంది. భక్తులు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి బస్సు సర్వీసులు, రైలు కనెక్టివిటీ ఉంది. అలాగే ఈ ప్రాంతానికి రోడ్డు మార్గంలో కూడా చేరుకోవచ్చు. భక్తి, ప్రకృతి, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ అరుదైన శైవక్షేత్రాన్ని మనం కూడా దర్శిద్దాం! శివానుగ్రహాన్ని పొందుదాం.
ఓం నమః శివాయ!
