SGSTV NEWS online
CrimeTelangana

మెడికోల కార్ రేసింగ్.. తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు.. అనాథలైన ముగ్గురు చిన్నారులు..



మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎండీ షాకీర్, షహానా బేగం దంపతులు మృతి చెందారు. అక్టోబర్ 16న వేడుకకు వెళ్లి వస్తుండగా, రోడ్డు మరమ్మతుల వద్ద నెమ్మదిగా వెళ్తున్న వారి బైక్‌ను వెనుక నుంచి వచ్చిన థార్ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన షహానా అక్కడికక్కడే మృతి చెందగా, షాకీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


కన్నవారి నీడలో హాయిగా పెరగాల్సిన ఆ చిన్నారుల జీవితాల్లో చీకట్లు అలుముకున్నాయి. అమ్మ ఒడిలో ఆడుకుంటూ, నాన్న చేయి పట్టుకుని సాగాల్సిన పసి ప్రాయంలోనే విధి ఆడిన వింత నాటకానికి ముగ్గురు చిన్నారులు దిక్కులేని వారయ్యారు. కుటుంబం కోసం కష్టపడుతూ, టైలరింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు… ఓ వేడుకకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డు మరమ్మతుల కారణంగా నెమ్మదిగా వెళ్తున్న వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ వాహనం ఢీకొట్టింది. ఆ తర్వాత మరో థార్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘోర ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా… ప్రాణాలతో పోరాడిన భర్త ఆస్పత్రిలో కన్నుమూశాడు.


మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్‌కు చెందిన ఎండీ షాకీర్, షహానా బేగం దంపతులు. టైలరింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబంలో ముగ్గురు పిల్లలే ప్రపంచం. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ, వారి భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు తల్లిదండ్రులు షాకీర్, షహానా బేగం. కానీ అక్టోబర్ 16వ తేదీ రాత్రి అదే చివరి ప్రయాణమవుతుందని తెలియదు. జిల్లా కేంద్రంలో ఓ వేడుకకు హాజరయ్యేందుకు దంపతులు తమ చిన్న కుమార్తెతో కలిసి బైక్‌పై బయలుదేరారు. గ్రామ సమీపంలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో నెమ్మదిగా వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన థార్ వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షహానా బేగం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు, రోడ్డుపై గాయాలతో పడి ఉన్న షాకీర్ కాళ్లపై నుంచి వెనుకగా వచ్చిన మరో థార్ వాహనం వెళ్ళింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాకీర్ కూడా చివరకు కన్నుమూశాడు. అమ్మ ఒడిలో ఉన్న చిన్నారి ఆయారా స్వల్ప గాయాలతో బయటపడింది.



అసలు ప్రమాదానికి కారణమైన మొదటి థార్ వాహనంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన నితిన్ తో పాటు మరొకరు విద్యార్థి ఉన్నట్లు గుర్తించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో ఓ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల ప్రయాణమే… ఓ కుటుంబంలో తీవ్ర విషాదానికి కారణమయ్యారు. ఘటనపై మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. కార్ రేసింగే ఈ ఘటనకు కారణమని పేర్కొంటున్నారు కుటుంబసభ్యులు..


రోడ్డుపై జరిగే చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆ ముగ్గురు చిన్నారుల భవిష్యత్తుకు ఎవరు అండగా నిలుస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. రహదారులపై వేగం కంటే ప్రాణాలు విలువైనవని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మరో కుటుంబం ఇలాంటి విషాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే వాహనదారులు బాధ్యతగా వ్యవహరించాలి.

Also read

Related posts