Man killed in Dispute over Matchbox : మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం రేగిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో జరిగిన ఘర్షణ కత్తిపోటుకు దారితీయగా, ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న వ్యక్తి మృతిచెందడంతో దివ్యాంగ భార్య, అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం: వెల్లబాడుకు చెందిన ఈపూరి యోహాన్ (46) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తుంటారని చెప్పారు. అతనికి భార్య బుజ్జి, కుమారుడు చంటి ఉన్నారన్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సీహెచ్. చరణ్‌తేజ రోడ్డుపై వెళ్తూ యోహాన్ను ఎదురుపడి, పొగ తాగేందుకు అగ్గిపెట్టె అడిగాడని చెప్పారు. ఆ సమయంలో ఇద్దరూ మద్యం మత్తులో ఉండటంతో ఈ విషయంపై వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆవేశంలో ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని వారిని సముదాయించి ఇళ్లకు పంపించారని వివరించారు.
కత్తితో దాడి – అక్కడికక్కడే కుప్పకూలిన యోహాన్: అయితే వివాదం అక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే చరణ్‌తేజ మరోసారి యోహాన్తో గొడవకు దిగాడు. తన ఇంటికి వెళ్లి కత్తి తీసుకొచ్చి యోహాన్ వీపుపై బలంగా పొడిచినట్లు పోలీసులు తెలిపారు. దీంతో యోహాన్ సొమ్మసిల్లి రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. ఇరుగపొరుగు వారు వైద్య సేవల నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారని వెల్లడించారు. అక్కడ అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
కేసు నమోదు – నిందితుడిపై చర్యలు: సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, కేసు నమోదు చేశారు. శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ అఫీజ్బాషా, ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు.
రోడ్డునపడిన కుటుంబం: యోహాన్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య బుజ్జి చెవిటి, మూగ దివ్యాంగురాలు. కుమారుడు చంటి చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న యోహాన్ హత్యకు గురికావడంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. తండ్రిని కోల్పోయిన కుమారుడు, భర్తను కోల్పోయిన భార్య కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు స్థానికులను కలచివేసింది. చిన్న గొడవ, మద్యం మత్తు కలిసి ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసిన ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు నింపింది.
Also read
- విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
- విజయవాడలో మహిళపై సామూహిక అత్యాచారం?
- రాఖీ పండుగకు వచ్చి.. నీటి కుంటలో జారిపడి అన్నదమ్ముల మృతి
- Telangana: ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు.. భద్రాచలం ఎమ్మెల్యే PAపై కేసు నమోదు!
- మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం వివాదం – ఓ నిండు ప్రాణం బలి




