SGSTV NEWS online
Andhra PradeshCrime

ఓరి నాయనో..వీళ్లేం విద్యార్థులు బాబోయ్…నర్సింగ్ హాస్టల్‌లో అమ్మాయిల విధ్వంసం భయానకం..!



కాకినాడలోని ఓ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ల చోరీ వివాదంపై నర్సింగ్ విద్యార్థినులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. సమాచారం అందుకున్న సర్పవరం పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు.. చివరకు..


కాకినాడ నగరంలోని వైద్యనగర్ ప్రాంతంలో హాస్టల్‌ విద్యార్థినుల మధ్య ఘర్షణ తీవ్ర కలకలం రేగింది. అక్కడి ప్రముఖ ఎస్.కే. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హాస్టల్‌లో విద్యార్థినుల నడుమ చోటుచేసుకున్న చిన్న వివాదం చివరకు పరస్పర దాడులకు దారితీసింది. హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థినుల మొబైల్ ఫోన్లు వరుసగా చోరీకి గురవ్వడమే ఈ ఘర్షణకు ప్రధాన కారణమని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఫోన్లు కనిపించకుండా పోతుండటంతో విద్యార్థినుల మధ్య అనుమానాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విద్యార్థినులు రెండు వర్గాలుగా విడిపోయారు. మాటమాట పెరిగి ఆవేశంతో పరస్పరం భౌతిక దాడులకు తెగబడ్డారు.




విద్యార్థినులు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో హాస్టల్ ప్రాంగణంలో తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ ఊహించని ఘర్షణలో పలువురు నర్సింగ్ విద్యార్థినులకు స్వల్ప గాయాలయ్యాయి. హాస్టల్ నిర్వాహకులు, తోటి విద్యార్థులు వారిని వారించడానికి ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపు తప్పడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే సర్పవరం సీఐ ఆధ్వర్యంలోని పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. గొడవ పడుతున్న విద్యార్థినులకు నచ్చజెప్పి, పరిస్థితిని తక్షణమే అదుపులోకి తెచ్చారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో హాస్టల్‌లో నెలకొన్న ఉద్రిక్తత సమసిపోయింది.




అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పోలీసులు, కళాశాల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఘర్షణలో పాల్గొన్న మణిపూర్ రాష్ట్రానికి చెందిన విద్యార్థినులను సురక్షితంగా వేరే హాస్టల్‌కు తరలించారు. అనంతరం విద్యార్థినులకు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. ఈ సంఘటనపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని, అసలు ఫోన్ల చోరీకి పాల్పడింది ఎవరు? ఘర్షణకు ప్రేరేపించిన అంశాలేంటి? అనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.

Also read

Related posts