సొంత పార్టీ లీగల్ సెల్ సభ్యుడి ఇంటిపై వైసీపీ ఎంపీపీ దాడి టెంటు, కుర్చీలు తెప్పించుకొని మరీ వీరంగం

తెనాలి టౌన్ : ‘నువ్వు లాయర్వి అయితే నాకేంటి.. నిన్ను చంపకుండా ఇక్కడి నుంచి కదిలేది లేదు. నీకు దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ వైకాపా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు హల్చల్ సృష్టించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కరెవరం గ్రామానికి చెందిన న్యాయవాది షేక్ ఖాదర్ హుస్సేన్ గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ఖాదర్ హుస్సేన్ ఇంటి నుంచి పట్టణంలోని కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన సమయంలో తెనాలి మండల వైకాపా ఎంపీపీ చెన్నకేశవులు, మరో వ్యక్తితో కలిసి బైక్ పై ఎదురుగా వస్తున్నప్పుడు వీరి వాహనాలు ఢీకొన్నాయి. ఖాదర్పై చెన్నకేశవులు దుర్భాషలాడగా వాగ్వాదం జరిగింది. పరస్పరం చేయి చేసుకున్నారు. ఆగ్రహించిన చెన్నకేశవులు తన అనుచరులు సుమారు 40మందిని ఘటనాస్థలికి పిలిపించారు. వారంతా న్యాయవాది ఇల్లు, కుటుంబసభ్యులపై దాడి చేశారు. కిటికీలు, తలుపులు పగలగొట్టారు.

భయభ్రాంతులకు గురైన కుటుంబసభ్యులు ఖాదర్ హుస్సేన్ ను ఇంట్లోకి తీసుకువెళ్లి తలుపులు వేసుకున్నారు. శాంతించని చెన్నకేశవులు ‘నిన్ను చంపే వరకూ ఇక్కడే ఉంటా’నంటూ టెంటు, కుర్చీలు తెప్పించుకున్నారు. పెట్రోల్ తీసుకురండి తగలబెట్టేద్దామంటూ కేకలు వేస్తూ వీరంగం వేశారు. పోలీసులు వచ్చి చెన్నకేశవులును అక్కడి నుంచి పంపించేందుకు యత్నించినా విన్లేదు. క్షమాపణ చెబితేనే వెళ్తానంటూ కేకలేశారు. గ్రామస్థులు, న్యాయవాదులు పెద్దసంఖ్యలో రావడంతో.. ‘తర్వాతైనా నీ అంతు చూస్తా’నంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తనకు, తన కుటుంబ సభ్యులకు చెన్నకేశవులు వల్ల ప్రాణహాని ఉందని ఖాదర్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నకేశవులు, అతని సోదరుడు శ్రీనివాస్, అనుచరుడు లక్ష్మయ్య పేర్లను అందులో ప్రస్తావించారు. బాధితుడు ఖాదర్ఫ్రుస్సేన్ వైసీపీ తెనాలి మండల లీగల్ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈఘటనపై బార్ అసోసియేషన్ సభ్యులు సోమవార నిరసనలకు పిలుపునిచ్చారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




