Kadiri Crime News: కదిరిలో ఓ కుటుంబం రైల్వేట్రాక్ పై సెల్ఫీ తీసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ప్రకటించడం సంచలనం రేపింది. తమ ఇంటికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని వారంటున్నారు.
Kadiri Railway Track Suicide Attempt: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని కమతంపల్లి గ్రామంలో ఓ కుటుంబం ఎదుర్కొంటున్న భూవివాదం చివరకు ప్రాణాలు తీసుకునే స్థితికి చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. తమ సొంత ఇంటికి వెళ్లే దారిని ప్రత్యర్థులు కంచె వేసి పూర్తిగా మూసివేశారని, న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ సదరు కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో విడుదల చేసిన సెల్ఫీ వీడియోలు కలకలం రేపాయి. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల వల్లే తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆరోపించడం కదిరి రాజకీయంగానూ హైలెట్ అవుతోంది.
కమతంపల్లి గ్రామానికి చెందిన భాగ్యరాజ్ తన ఇంటికి వెళ్లే దారిని కంచెతో దిగ్బంధించడంతో నిత్యం నరకం చూస్తున్నామని, అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తూ తమ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితులు మొదటి వీడియోలో పేర్కొన్నారు. అది తీవ్రంగా చర్చనీయాంశమవుతుండగానే, ఆ వెంటనే బాధితుడు నేరుగా రైల్వే ట్రాక్‌పైకి వెళ్తున్న మరో వీడియో వెలుగులోకి రావడం గ్రామంలో తీవ్ర ఉత్కంఠను, భయాందోళనలను రేకెత్తించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఎమ్మెల్యేనే కారణమని రైలు పట్టాలపై నుంచి సెల్ఫీ వీడియో
ఈ ఆవేదనకర ఘటనకు స్థానిక కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌తో పాటు కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని బాధితులు తమ సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ నియోజకవర్గంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఆయన మద్దతుతోనే ప్రత్యర్థులు తమ దారిని అడ్డుకుని వేధిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఎమ్మెల్యే నుంచి, అధికారుల నుంచి తమకు ఎలాంటి న్యాయం జరిగే పరిస్థితి లేదని, అందుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ తక్షణమే జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని ఆక్రోశంతో వేడుకున్నారు.
పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు
ఒక కుటుంబం ఏకంగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధపడి రైల్వే ట్రాక్ వరకు వెళ్లినప్పటికీ.. స్థానిక పోలీసులు కనీసం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గే స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బాధితుల ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారని గ్రామస్థులు, బాధితుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అండ చూసుకుని సామాన్యులను వేధిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తొందరపడితే కుటుంబం నాశనం
ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న భయం కమతంపల్లి గ్రామంలో నెలకొన్నందున.. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ క్షేత్రస్థాయి రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడటం తగదని, కాలయాపన చేయకుండా సీనియర్ అధికారులు వచ్చి ఈ భూవివాదాన్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించడంతో పాటు, ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగి బాధ్యతాహితంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Also read
- నేటి జాతకములు 26 జూలై, 2026
- కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం – రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం..ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
- తల్లికి వందనం డబ్బుల కోసం భార్య హత్య
- కోనసీమ జిల్లాలో విషాదం.. పంటకాల్వలో మునిగి ముగ్గురి మృతి
- ఐదో అంతస్తు నుంచి దూకి పీజీ వైద్యవిద్యార్థిని బలవన్మరణం






ఏపీని డ్రగ్స్, గంజాయి రాష్ట్రంగా మార్చిన జగన్ ప్రభుత్వం: సాధినేని యామిని