రాయచోటి, చిత్తూరుజిల్లా : అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ విభాగంలో తహసీల్దార్ పనిచేస్తున్న శ్రీనివాసులు గురువారం చిత్తూరు నగర సమీపంలోని సిద్ధంపల్లె వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో తమిళనాడులోని కాట్పాడి నుంచి చిత్తూరు వస్తున్న మెము ఎక్స్ప్రెస్ రైలు సిద్ధంపల్లె వద్దకు చేరుకుంటున్న సమయంలో పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు. ఆయన 2024 ఎన్నికల సమయంలో రామాపురం తహసీల్దారుగా పనిచేసి ఎన్నికల తర్వాత లక్కిరెడ్డిపల్లెకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో పీజీఆర్ఎస్ అర్జీపై వచ్చిన అభియోగాల కారణంగా ఉన్నతాధికారులు విచారించి ఆ మండలంలోని వీఆర్వో వెంకటరమణను సస్పెండ్ చేయగా శ్రీనివాసులును కలెక్టరేట్లోని కేఆర్ఆర్సీ (కోనేరు రంగారావు రిఫామ్స్ కమిటీ) విభాగానికి బదిలీ చేశారు. జిల్లా కేంద్రం మదనపల్లెకు మారాక పీజీఆర్ఎస్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాల మీద ఇటీవల ఉన్నతాధికారులు విచారణ చేసి, తప్పులు దొర్లాయనే విషయాన్ని సీసీఎల్ఎకు నివేదించినట్లు తెలిసింది. ఆయన కొద్దిరోజులుగా ఆనారోగ్యం కారణంగా సెలవు పెట్టి చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసులు భార్య ఇదే జిల్లా సదుం ఎంపీడీవోగా పనిచేస్తూ ఇటీవల అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నట్లు తెలిసింది.. ఆయన కుమార్తె ఉన్నతవిద్య కోసం అమెరికా వెళ్లారు. పదో తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీఎస్ పోలీసులు తెలిపారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





