తిరుపతి: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో దారుణఘటన చోటుచేసుకుంది. పద్మావతి కళ్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఓ వివాహ వేడుకకు వచ్చిన వ్యక్తిపై ప్రశ్నల వర్షం కురిపించిన ఇద్దరు వ్యక్తులు.. ఆ తర్వాత అనూహ్య రీతిలో ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయం వెలుగు చూసింది.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ జంట హత్యల వెనుక కుటుంబ వివాదమే కారణమని తెలుస్తోంది. ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన సునీల్.. తిరుమలలో పనిచేసే సంపూర్ణమ్మ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీళ్ల వివాహానికి మునిరత్నం, మణికంఠలు దగ్గరుండి సహకరించారు. అయితే.. కొన్ని నెలలుగా సునీల్ భార్యకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. కారణం ఏంటో చెప్పడం లేదని.. ఎంత బతిమాలినా సునీల్ వినలేదని తెలుస్తోంది. ఈ విషయంలో పెద్దలు సర్దిచెప్పాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
దీంతో.. బుధవారం రాత్రి తిరుచానూరు రోడ్డులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఓ వివాహానికి అతను హాజరైన విషయం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో తన కుమార్తెకు అండగా ఉన్న మునిరత్నం, మణికంఠలకు ఆమె సమాచారం ఇచ్చింది. వాల్లిద్దరూ వివాహ మండపానికి చేరుకుని సునీల్ను నిలదీశారు.
నీ భార్యను ఎందుకు వదిలేశావు? అని ప్రశ్నించారు. దానికి సునీల్ నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సమయంలో సునీల్తో పాటు అతడి తమ్ముడు, అక్క, మరో బంధువు అక్కడికి చేరుకున్నారు. ఆ నలుగురూ కలిసి మునిరత్నం, మణికంఠలపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
దాడిలో తీవ్రంగా గాయపడిన మునిరత్నం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న మణికంఠను తిరుపతి.. రుయా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. వీళ్లిద్దరూ జీవకోనకు చెందిన వాళ్లుగా తెలుస్తోంది.
సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం, సీఐ శ్రీనివాసులు, వెస్ట్ సీఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు.
నిందితులు అదుపులోకి.. విచారణ కొనసాగింపు
భార్యాభర్తల గొడవ.. పెళ్లి వేదికలో మొదలైన వివాదం.. చివరకు ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన తిరుపతిలో సంచలనంగా మారింది. జంట హత్యలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న సునీల్తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనకు పూర్తి కారణాలు, దాడిలో పాల్గొన్న వారి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
Also read
- శవయాత్రగా మారుతున్న సరదా యాత్రలు..మాసాలోద్ది జలపాతంలో పడి బీటెక్ విద్యార్థి మృతి..
- నారీ నారీ నడుమ సీఐ రాములు నాయక్.. ఒంటరి మహిళతో పెళ్లి.. మరో లేడీ గుట్టుగా యవ్వారం.. కట్ చేస్తే..
- మద్యం సేవించొద్దన్నందుకు.. అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
- ఒక ప్రశ్న.. రెండు నిండు ప్రాణాలు బలి!
- దొంగను పట్టుకున్నాం సార్! అయితే స్టేషన్ లో దింపేసి వెళ్లండి.





