*నియమించిన ప్రభుత్వాలకు పేరు తెచ్చేలాగా పనిచేయాలి….*
*ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎప్పుడు పడితే అప్పుడు శివలింగానికి అభిషేకాలు చేయరాదు…*
అమరావతి :
గుంటూరు నగరం లోని కొత్తపేటలో ఉన్న శివాలయం ఎండోమెంట్ పరిధిలోకి వస్తుంది. దానికి సంబంధించిన రాజకీయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సాయంత్రాలు పూట కూడా శివలింగానికి అభిషేకాలు చేయమని అర్చకులపై తీవ్ర ఒత్తిడి చేస్తూ, వివాదమైన నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఈ విషయమై స్పందిస్తూ దేవాలయ నియమ నిబంధనలు, అర్చకుల, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయాల పాలక మండళ్లు పనిచేయాలని, రాజకీయ పార్టీలు తమ పార్టీ నిరుద్యోగ కార్యకర్తలను దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలకమండల్లోకి ప్రవేశపెట్టి ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా పాలక మండల్లు ప్రవర్తిస్తున్నాయని, వీటిని కట్టడి చేయాల్సిన బాధ్యత నియమించిన రాజకీయ పార్టీల నేతలకు, ఎండోమెంట్ శాఖ అధికారులకు ఉన్నదని శ్రీధర్ తెలియజేశారు. ఈ వివాదానికి సంబంధించి అంశం మీద శ్రీధర్ వివరణ ఇస్తూ మన దక్షిణ భారత దేశంలో శైవాగమం, కారణాగమం, శాక్తానంద తరంగిణి, ప్రపంచ సార తంత్రం, రుద్ర యామళం తదితర ఆగమ గ్రంథాల్లో ఈశ్వరునికి/శివలింగం కు చేసే నిత్య అభిషేకాలు, అర్చనలు గురించి స్పష్టంగా రాయబడి ఉంది. వాటి ప్రకారమే దక్షిణ భారతదేశంలో దేవతార్చనలు, అభిషేకాలు,పూజలు జరుపుతారని, భోజనాంతరం శివలింగానికి అభిషేకాలు,అర్చన చేయటానికి నిషిద్ధమని ఆలయ ఆగమ శాస్త్రాలలో లిఖించబడి ఉందని, అయితే అర్చకులు రోజంతా ఉపవాసముండి విశేషమైన రోజుల్లో/పర్వదినముల యందు మధ్యాహ్న కాలం, సాయంత్రం, రాత్రి కాలంల యందు అభిషేకం చేయటం అనేది శాస్త్ర సమ్మతమని శ్రీధర్ తెలిపారు. ఉదాహరణకు మహాశివరాత్రి పర్వదినం, కార్తీక పౌర్ణమి, ఆరుద్రోత్సవం పర్వదినాలలో ఉపవాసముండి అభిషేకం చేయటానికి ఆలయ ఆగమ శాస్త్రంలో అనుమతి కలదని శ్రీధర్ తెలియజేశారు. అందువల్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాలకమండలులకు ఆలయ ఆగమ శాస్త్రాలపై అర్చనలు, అభిషేకాలు ,పూజలు విధానాలపై ముందుగా శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాతే వాళ్ళని పాలక మండల కమిటీలుగా వేయాలన దీనిపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలని శ్రీధర్ ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా, దేవాలయాలకు దాతల నుంచి నిధులు సమకూర్చి దేవాలయాన్ని అభివృద్ధి చేసేలాగా, భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించేలాగా పనిచేయాలనీ, దేవాలయాలకు సంబంధించిన విషయాలను వివాదం చేసేలాగా పాలకమండళ్ళు పనిచేయకూడదని, దానివల్ల మిమ్మల్ని నియమించిన ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు మీవల్ల వస్తుందని, ఈ పరిణామాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని శ్రీధర్ తెలిపారు.
Also read
- కుమారుడిపై పెట్రోల్ పోసి, తానూ నిప్పంటించుకున్న తల్లి
- దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీలు దేవాలయ ఔన్నత్యాన్ని పెంచే విధంగా పనిచేయాలి….
- Garuda Purana: గరుడ పురాణం ప్రకారం అప్పు తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది?
- Telangana: ప్రభుత్వ ఆఫీసులో ఇదేం పని.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన తహశీల్దార్..
- మియాపూర్ భర్త మిస్సింగ్ డ్రామాలో ట్విస్ట్.. ప్రియుడితో కలిసి చంపి, పాతేసింది భయ్యా!





