పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు లోహగఢ్ కోట వద్ద క్రైమ్ సీన్ రీక్రియేషన్ నిర్వహించి కీలక ఆధారాలు సేకరించారు. నిశ్చితార్థమైన కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి సియా గోయల్ హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించి, బలమైన ఆధారాలతో ఛార్జ్‌షీట్ సిద్ధం చేస్తున్నారు.
ఒక నిశ్చితార్థం.. ఒక విహారయాత్ర.. కానీ, ఆ కొండ కోనల్లో రాసిపెట్టి ఉన్న క్లైమాక్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్! పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న అసలు మిస్టరీ ఇప్పుడిప్పుడే వీడుతోంది. లోహగఢ్ కోటపై ఆ రోజు అసలు ఏం జరిగింది? అది ప్రమాదమా? ముందస్తు వ్యూహమా? సీన్ రీక్రియేషన్‌తో అసలు నిజాన్ని రాబట్టారు పోలీసులు. ఇంతకీ.. కాబోయేవాణ్ని చంపేసిన సియా గోయల్ ఏం చెప్పింది? అనే వివరాలను తెలుసుకుందాం.. పుణె రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. జూన్ 18న లోహగఢ్ కోటపై జరిగిన ఈ హత్య ఉదంతంలో.. ప్రధాన నిందితులైన సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు నేరుగా ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. లోహగఢ్ కోటపై అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పుణె రూరల్ పోలీసులు ‘క్రైమ్ సీన్ రీక్రియేషన్’ చేశారు. వాళ్లు కోటకు ఏ మార్గంలో వచ్చారు? ఎక్కడెక్కడ నిలబడ్డారు? కేతన్‌ను కొండపై నుంచి ఎలా నెట్టేశారు? అనే పూర్తి వివరాలను నిందితుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేశారు. ఈ సీన్ క్రియేషన్‌తో నిందితులు చెబుతున్న వాదనల్లో నిజం ఎంతుందో తేలుతుందంటున్నారు పోలీసులు.
అంతేకాదు.. కేతన్‌ను కొండపై నుంచి నెట్టేయడానికి ముందు సియా గోయల్ తన ప్రియుడికి ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చింది? అసలు ప్రియుడు చేతన్ చౌదరి టికెట్ తీసుకోకుండానే కోటలోకి ప్రవేశించి ఈ జంటను వెంబడించాడా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణ సజావుగా సాగడం కోసం లోహగఢ్ కోటలోకి పర్యాటకుల ప్రవేశాన్ని పోలీసులు తాత్కాలికంగా నిలిపివేశారు.
మరోవైపు, కేతన్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సియా పోలీసుల ఎదుట అంగీకరించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే, ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో సియా గోయల్ కుటుంబ సభ్యుల పాత్రపై కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శనివారం సియా తల్లిదండ్రులు ప్రవీణ్, పూజలతో పాటు ఆమె సోదరుడు సాహిల్‌ను లోనావాలా రూరల్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 12 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. అంతకుముందు శుక్రవారం కూడా సాహిల్‌ను 10 గంటల పాటు ప్రశ్నించారు.
కాబోయే భర్తను కొండపై నుంచి నెట్టేసి.. ప్రమాదంగా చిత్రీకరించాలని చూసిన కిల్లర్ లవర్స్ గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు. కేతన్ అగర్వాల్ కుటుంబం నివసించే గహుంజే ప్రాంతంలో స్థానికులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. సీన్ రీక్రియేషన్ ద్వారా మరిన్ని కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు.. నిందితులకు గట్టి శిక్ష పడేలా బలమైన ఛార్జ్‌షీట్ సిద్ధం చేసే పనిలో పడ్డారు.
Also read
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి
- Kakinada: కాకినాడ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత!
- Janwada: జన్వాడలో దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసిబిడ్డ అనాథ
- హైదరాబాద్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో.. అర్ధరాత్రి ఓ మహిళ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే..
- విజయనగరంలో భారీ భూ కుంభకోణం.. MSME పార్క్ కోసం తవ్వుతుంటే వైసీపీ నేత ఘరానా స్కామ్..?





