హైదరాబాద్‌లోని ఓ మహిళల హాస్టల్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న యువతి బాత్రూంలో ప్రసవించిన అనంతరం నవజాత శిశువును వెంటిలేటర్ ద్వారా బయటకు పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శిశువు అక్కడికక్కడే మృతి చెందగా, అస్వస్థతకు గురైన యువతిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
సమాజాన్ని కలిచివేసే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనసులను భారంగా మార్చేస్తాయి. అలాంటి విషాదకర ఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పుట్టిన కొన్ని క్షణాలకే ఓ నవజాత శిశువు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. హైదరాబాద్ గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మహిళల హాస్టల్‌లో ఉంటున్న యువతి ఇటీవల బాత్రూంలో ప్రసవించినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా జరిగినట్లు తెలుస్తోంది. ప్రసవం అనంతరం శిశువును బాత్రూం వెంటిలేటర్ ద్వారా బయటకు పడేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆ పసికందు అక్కడికక్కడే మృతి చెందింది. కొంతసేపటి తర్వాత యువతి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో హాస్టల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఆమెను వెంటనే నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
యువతి పరిస్థితిని గమనించిన వైద్యులు ప్రసవం జరిగినట్లు గుర్తించడంతో విషయం బయటపడింది. హాస్టల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృత శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.
ఈ ఘటనలో ఆశ్చర్యకర అంశం ఏమిటంటే యువతి గర్భవతి అన్న విషయం హాస్టల్‌లో ఉన్నవారికి తెలియకపోవడం. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. యువతి గర్భం దాల్చడానికి గల కారణాలు, ఈ విషాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటన్న దానిపై ఆరా తీస్తున్నారు.
నవమాసాలు మోసి కన్న బిడ్డను కాపాడాల్సిన తల్లి చేతుల నుంచే ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన నగరంలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే యువతి పరిస్థితి, ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు, ఘటన వెనుక అసలు నిజాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




