మండు వేసవిలో ఉక్కపోస్తుండగా ఎవరైనా హుడీ ధరిస్తారా? ఇదే అనుమానం పుణే పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించడంతో అసలు నిజం బయటపడింది. అప్పటి వరకు ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పరిగణించబడిన కేసు కొత్త మలుపు తిరిగింది. పథకం ప్రకారం హత్య చేశారని వెల్లడైంది.
పుణే: మహారాష్ట్రలో సంచలనం రేపిన పుణే వ్యాపారవేత్త కేతన్
విశాల్ అగర్వాల్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూన్ 18న లోహగడ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడిపోయి విశాల్ చనిపోయాడు. తనను ఫొటోలు తీస్తూ ప్రమాదవశాత్తు అతడు లోయలో పడిపోయాడని అతడికి కాబోయే భార్య సియా గోయల్ (Siya Goyal).. లూనావాలా రూరల్ పోలీసులకు చెప్పింది. అయితే ప్రియుడితో కలిసి విశాల్‌ను ఆమె లోయలోకి తోసేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.
ఎలా కనిపెట్టారంటే..?
కాబోయే భార్య సియా గోయల్‌తో కలిసి కేతన్ అగర్వాల్ (Ketan Agarwal)ఈ నెల 18 న చరిత్రక లోహగడ్ కోట కు వెళ్లాడు. వీరిని కొంత దూరం నుంచి ఓ వ్యక్తి వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి.. తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. ఆ రోజు ఉష్ణోగ్రత సుమారు 33 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఇలాంటి ఉక్కపోత వాతావరణంలో అతడు హుడీ ఎందుకు ధరించాడనే సందేహం పోలీసులకు వచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా, వెంటనే హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది.
మరోవైపు కేతన్ మరణించిన తర్వాత కూడా సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పెళ్లి ఇష్టం లేనట్టుగా సియా గోయల్ కనిపించిందని కేతన్ మామ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. పెళ్లిని ఏడాది పాటు వాయిదా వేయవచ్చా అని ఒకసారి తనను అడిగిన విషయాన్ని వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కుట్ర కోణంలో దర్యాప్తు మొదలుపెట్టడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ప్రియుడు చేతన్ చౌదరి (Chetan Choudhary)తో కలిసి సియా గోయల్ తనకు కాబోయే భర్తను హత్య చేసిందని నిర్ధారణయింది.
2,004 ఫోన్ కాల్స్
సాంకేతిక ఆధారాలతో సియా, చేతన్ మధ్య సన్నిహిత సంబంధాలు బయటపడ్డాయి. చేతన్ సోషల్ మీడియా ఫోటోలను సీసీటీవీ దృశ్యాలతో పోల్చి చూడగా, ఫుటేజ్‌లో కనిపించిన వ్యక్తి అతడేనని పోలీసులు నిర్ధారించారు. ఇక గత ఏడు నెలల్లో సియా, చేతన్ మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగినట్లు, వాటి మొత్తం వ్యవధి 238 గంటలకుపైగా ఉన్నట్లు విచారణలో తేలింది. గతేడాది నవంబరు నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసింది. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా, చేతన్ డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్‌తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం.
మొదటి హత్యాయత్నం విఫలం!
కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా, చేతన్ తో కలిసి అతడిని హత్య చేయాలని కుట్ర చేసింది. ఇందులో భాగంగా కేతను సియా.. ఫొటో షూట్ పేరుతో లోహగడ్ కోటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడికి వచ్చిన చేతన్‌తో కలిసి కేతన్‌ను లోయలోకి తోసేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. మొదటి హత్యాయత్నం విఫలమైందని వెల్లడించారు. జూన్ 14న కూడా లోహగడ్ కోట వద్ద సియా కేతన్‌ను లోయలోకి నెట్టేసి చంపేందుకు ప్రయత్నించింది. అయితే అతడు పక్కనే ఉన్న పొదను పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి అనుమానం రాకుండా ఉండేందుకు కట్టుకథ అల్లింది. పాము కనిపించడంతో భయంతో అతడి మీద పడ్డానని చెప్పడంతో కేతన్ నమ్మేశాడు.
ప్లాన్- సీ కూడా సిద్ధం!
మొదటి ప్రయత్నం విఫలం కావడంతో జూన్ 18న మళ్లీ పథకం అమలు చేసి కేతన్‌ను హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే అమలు చేసేందుకు మరో ప్రత్యామ్నాయ ప్రణాళికను (“ప్లాన్-సీ”) సిద్ధం చేసుకున్నట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సియా గోయల్, చేతన్ చౌదరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్‌క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





