భద్రాచలం: భద్రాచలంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో
చనిపోయిన ముగ్గురి మృతదేహాలను అద్దె ఇంటికి తీసుకురాకుండా యజమాని తాళం వేశారు. వివరాల్లోకి వెళితే.. భద్రాచలంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన దూడల సాయిప్రకాశ్ (25), సంధ్య (22) దంపతులకు ఇద్దరు కుమారులు రుత్విక్, మోక్షిత్ (2) ఉన్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి ములకలపల్లి గ్రామానికి వచ్చిన వారి బంధువులు.. సాయిప్రకాశ్ కుటుంబాన్ని నిద్ర చేసేందుకు పిలిచారు. అందుకోసం సాయిప్రకాశ్ తన భార్య, చిన్న కుమారుడు మోక్షిత్, తల్లి జ్యోతిలతో ములకలపల్లికి కారులో వెళ్లారు. ఆదివారం తిరిగి భద్రాచలం వస్తుండగా.. కారు అదుపుతప్పి మాధారం అటవీ ప్రాంతంలోని చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయిప్రకాశ్, సంధ్య, మోక్షిత్లు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాలపాలైన జ్యోతిని పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

మృతదేహాలకు పాల్వంచలో పోస్టుమార్టం అనంతరం సోమవారం భద్రాచలంలోని వెంకటేశ్వర కాలనీలోని అద్దె ఇంటికి బంధువులు తీసుకొచ్చారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించి స్థానికులు యజమానికి ఫోన్ చేశారు. ఇంట్లోకి మృతదేహాలను తీసుకొచ్చేందుకు ఆయన అంగీకరించలేదు. సాయిప్రకాశ్ తండ్రి శ్రీనివాస్ విద్యుత్శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ.. ఆర్నెల్ల కిందట గుండెపోటుతో మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆర్నెల్ల వ్యవధిలో మృతిచెందడం అరిష్టమని.. ఇంట్లో అద్దెకు ఎవరూరారనే కారణంతో యజమాని ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అదే అంబులెన్స్లో మృతదేహాలను అంత్యక్రియల కోసం పురుషోత్తపట్నం తీసుకెళ్లారు.
Also read
- డాక్టర్ ప్రియాంక మరణంపై హత్య కేసుగా నమోదు చెయ్యాలి KVPS డిమాండ్
- యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఫైళ్లు
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ఉదయం పరిచయం.. మధ్యాహ్నం పెళ్లి.. రాత్రికి శోభనం అంటే పరిగెత్తిన వరుడు.. తీరా చూస్తే..!
- రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత





