SGSTV NEWS online
CrimeTelangana

రైల్లో ఫోన్.. చెరువులో శవం..! సినిమాను మించిన ట్విస్ట్‌లు.. పోలీసులు ఎలా చేధించారంటే?



ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో తీవ్ర సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దృశ్యం సినిమా తరహాలో యువకుడిని హత్య చేసి.. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు, మృతదేహాన్ని ఒక దగ్గర అతని ఫోన్‌ను ఒక దగ్గర పడేసినట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


ప్రేమ వ్యవహారానికి అడ్డుగానే ఉన్నాడనే కారణంతో సొంత స్నేహితుడినే హత్య చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసిన నిందితులు.. ఎవరికి అనుమానం రాకుండా మృతుడి బైక్‌ను ఆదిలాబాద్‌. ఫోన్‌ను మహారాష్ట్ర వెళుతున్న ట్రైన్‌ పడేసినట్టు పోలీసులు గుర్తించారు. స్ధానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసును ఛాలేంజ్ గా తీసుకున్న ఆదిలాబాద్ పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే వివరాలు వెల్లడించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం పెద్దబుగ్గారం గ్రామానికి చెందిన నాతరి సతీష్ (23) ఈ నెల 17న అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులకు, 19న బోథ్ మండలంలోని కరాత్వాడ చెరువులో ఓ యువకుడి మృతదేహం లభ్యం అయినట్టుగా సమాచారం వచ్చింది. మృతుడు నాతరి సతీష్ గా గుర్తించిన పోలీసులు మిస్సింగ్ కేసును కాస్త హత్య కోణంలో లోతుగా విచారణ చేపట్టారు‌. యువకుడి ఫోన్ మిస్ అవడంతో ఆ కోణంలో ముమ్మర దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సహాయంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి 48 గంటల్లోనే కేసును ఛేదించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ సుమేర్ ప్రేమ వ్యవహారానికి సతీష్ అడ్డువస్తున్నాడనే కోపంతో ఈ హత్యకు కుట్ర పన్నినట్టుగా తేల్చారు పోలీసులు. షేక్ సమీర్ తన స్నేహితులతో కలిసి సతీష్ ను ఈనెల 17 న మద్యం పార్టీ పేరుతో కరాత్వాడ చెరువు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సతీష్ కు బలవంతంగా మద్యం తాగించి.. అనంతరం గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు. ఆధారాలు మాయం చేసేందుకు శవాన్ని చెరువులో పడేసి, సతీష్ బైక్ ను ఆదిలాబాద్ కు తరలించినట్టు మొబైల్ ఫోన్ మాత్రం ఓ రైలులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.


మృతుడు దళిత సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల నుంచి 5 మొబైల్ ఫోన్లు, నేరానికి వినియోగించిన 2 ద్విచక్ర వాహనాలు, మృతుడి బైక్, సంఘటనా స్థలంలో దొరికిన 7 ఖాళీ బీరు సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య కేసులో నేరడిగొండ మండలం కుమారి గ్రామానికి చెందిన షేక్ సుమేర్ (24) ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు.

నేరడిగొండకు చెందిన గంగాధరి సాయి కృష్ణ (23), కుప్తి గ్రామానికి చెందిన బొజ్జ విష్ణువర్ధన్ (22), బోథ్ పట్టణం ఇస్లాంపురా కాలనీకి చెందిన షేక్ అక్రమ్ (22), అలాగే బోథ్ సాయినగర్ కాలనీకి చెందిన అబ్దుల్ నెహెఫ్ (19), సయ్యద్ నోమాన్ (19) లను సహ నిందితులుగా గుర్తించిన పోలీసులు.. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Also read

Related posts