SGSTV NEWS online
Andhra PradeshCrime

బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య




విశాఖపట్నం: రామాటాకీస్ వెనుక వైపున గల శ్రీనగర్ లో నివాసముంటున్న దంపతులు బలరాం (33), ప్రియాంక (27) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ద్వారకా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి చెందిన వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకుని, బతుకుతెరువు కోసం విశాఖ వచ్చి స్థిరపడ్డారు. వెల్డింగ్ పనులు చేసే బలరాం మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండటంతో ప్రియాంక గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బలరాం బిర్యానీ కావాలని పట్టుబట్టడంతో ప్రియాంక తల్లి బయటకు వెళ్లగా, ఆమె తిరిగి వచ్చేసరికి దంపతులిద్దరూ ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న నైట్ రౌండ్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచు తరలించారు. అయితే బలరామే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రియాంక బలవన్మరణానికి పాల్పడటంతో భయపడి బలరాం ఆత్మహత్యకు ఒడిగట్టాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కళ్లెదుటే తల్లిదండ్రులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడడంతో వారి నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలిపోయాడంటూ ప్రియాంక తల్లి రోదించడం స్థానికులను కలచివేసింది.

Related posts