ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఈత కొట్టేందుకు నీటి కుంటలోకి దిగిన నలుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీట మునిగి గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు చేపట్టారు.
గల్లంతైన విద్యార్థులందరూ 14 ఏళ్ల లోపు వయసున్న వారే కావడంతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. విద్యార్థులను కరేటి అభిరామ్ (14), కరేటి సుశాంత్ (12), పొదిలి ఈశ్వర్ (11), ఇండ్ల దినేష్ (11)లుగా గుర్తించారు. గురువారం(జూన్ 04) పిల్లలు ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెతకగా, స్థానిక నీటి కుంట ఒడ్డున వారి దుస్తులు, చెప్పులు లభ్యమయ్యాయి. దీంతో పిల్లలు కుంటలో మునిగిపోయినట్లు నిర్ధారించుకుని కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గజఈతగాళ్ల సాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఒక విద్యార్థి మృతదేహాన్ని ఫైర్ సిబ్బంది వెలికి తీశారు. మిగిలిన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి స్పందించారు. విద్యా్ర్థుల కుటుంబాలను ఓదార్చేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుంటలో గల్లంతైన మిగిలిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ ఘటనతో చెరువుకొమ్ముపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





