ఒంగోలు టౌన్: ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తల్లిదండ్రుల సంపాదన అంతంతమాత్రమే కావడంతో కుమారుడిగా బాధ్యత నెత్తిమీద వేసుకున్నాడు. ఇంకా చదువుకోవాలని ఉన్నా.. పదో తరగతి వరకే చదివాడు. తమ్ముడిని, చెల్లిని చదివించాలని కలలుగన్నాడు. కానీ, ఆ కలలు తీరకుండానే లోకం విడిచాడు. రోడ్డు ప్రమాదం ఆ ఇంటిని అంతులేని విషాదంలో నింపింది.
బాధిత కుటుంబం కథనం ప్రకారం… ఒంగోలు నగరానికి చెందిన కడియం గోపి, శ్రావణి దంపతులకు ముగ్గురు సంతానం. గోపి ఆటో డ్రైవర్, శ్రావణి ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. పెద్ద కుమారుడు లోకేష్ (21) పదో తరగతి వరకే చదువుకున్నాడు. తనకు బాగా చదువుకోవాలని ఉన్నప్పటికీ కుటుంబం గడిచే పరిస్థితి లేకపోవడంతో కష్టంగానే చదువు మానుకుని పనులకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు.
త్రోవగుంటలోని ఒక మోటారు సైకిల్ కంపెనీలో పనికి చేరాడు. తమ్ముడు, చెల్లెలు చదువుతుంటే సంతోషించేవాడు. ఎప్పుడూ సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటికి వచ్చే లోకేష్.. మంగళవారం పని ఎక్కువగా ఉందని ఇంటికి రాలేదు. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో తమ్ముడికి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చే దారిలో దశరాజుపల్లి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద తనకు ప్రమాదం జరిగిందని, వెంటనే రావాలని చెప్పాడు. ఆ మాటలు పూర్తి కాకుండానే ఫోన్ స్విచాఫ్ అయింది.
ఆందోళన చెందిన లోకేష్ కుటుంబ సభ్యులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు మీద లోకేష్ నిర్జీవంగా పడి ఉన్నాడు. దాంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. వారి ఆవేదనతో చూపరుల గుండెలు సైతం తరక్కుపోయాయి. లోకేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం





