దత్తాత్రేయ పరిపూర్ణ అనుగ్రహం అందించే దత్తాత్రేయ తిలకం- గురువారం దత్తాత్రేయుని పూజ విధానం మీకోసం
Dattatreya Tilakam for Guru Dosha Relief: నవగ్రహాలలో గురు గ్రహం శుభ గ్రహమని అంటారు. గురుగ్రహం అనుకూలత ఉంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. ఒక్క గురు గ్రహం అనుకూలంగా ఉంటే చాలు తక్కిన గ్రహాలు అనుకూలంగా లేకపోయినా తలపెట్టిన కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. గురు గ్రహం అంత శక్తివంతమైన గ్రహం. అయితే గోచార రీత్యా గురు గ్రహ అనుకూలత లేనప్పుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో దత్తాత్రేయ స్వామి వంటి గురువులను ఆశ్రయించడం, కొన్ని ప్రత్యేక పరిహారాలు ఆచరించడం వలన శుభాలు కలుగుతాయని అంటారు. ఆ పరిహారాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయుడు
సృష్టి స్థితి లయకారులైన త్రిమూర్తులు తమ తమ అంశాలను ఒక్కటిగా చేసి అత్రి మహర్షి, అనసూయ దంపతులకు వరపుత్రుడిగా జన్మిస్తాడు. ఆ వరపుత్రుడే దత్తాత్రేయుడు. బాల్యం నుంచి ఎన్నో మహిమలు ప్రదర్శిస్తూ, దిగంబరుడిగా, అవధూతగా ఆవిర్భవించిన దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించడం వలన గురు గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వాసం. దత్తాత్రేయుని అనుగ్రహాన్ని పొందడానికి ఉద్దేశించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
గురువారం దత్తాత్రేయుని పూజ
గురు గ్రహ అనుగ్రహం పొందడానికి గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించాలి. గురువారం రోజు సూర్యోదయం తోనే తలారా స్నానం చేసి పూజామందిరంలో దత్తాత్రేయ స్వామి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్టించుకోవాలి. ముందుగా ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. దత్తుని విగ్రహాన్ని కనుక ప్రతిష్ఠిస్తే పంచామృతాలతో అభిషేకం చేయాలి. అనంతరం గురువుకు పసుపు రంగు ప్రీతికరం కాబట్టి పసుపు రంగు పూలతో దత్తాత్రేయ స్వామిని అలంకరించాలి.
పూజా విధానం
పసుపు రంగు అక్షింతలతో, పువ్వులతో దత్తాత్రేయ స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. అనంతరం పసుపు రంగులో ఉండే అరటిపండ్లు, పులిహోర, లడ్డులు వంటి ప్రసాదాలు నివేదించాలి. పూజ పూర్తయ్యాక శ్రీ దత్తస్తవం, దత్తాత్రేయ కవచం, గురుచరిత్ర పారాయణ చేయాలి. చివరగా కర్పూర నీరాజనం ఇచ్చి నమస్కరించుకోవాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. ఈ పూజలో దత్తాత్రేయ తిలకాన్ని తయారు చేయడం విశేషం. దత్తాత్రేయ తిలకమంటే ఏమిటో చూద్దాం.
దత్తాత్రేయ పరిపూర్ణ అనుగ్రహం అందించే దత్తాత్రేయ తిలకం
గురుగ్రహ దోష నివారణకు శక్తివంతమైన పరిహారం దత్తాత్రేయ తిలక ధారణం. ఈ తిలకాన్ని గురువారం రోజు మాత్రమే తయారు చేయాలి. దత్తుని పరిపూర్ణ అనుగ్రహాన్ని అందించే ఈ దత్తాత్రేయ తిలకాన్ని అరటి పువ్వు తిలకం అని కూడా అంటారు. ఇంతకు ఈ తిలకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం.
అరటి పువ్వు తిలకం
గురుగ్రహానికి ప్రతీక అరటి చెట్టు. అందుకే గురువు అనుగ్రహం కోరుకునే వారు అరటి చెట్టును పూజించాలని శాస్త్రం చెబుతోంది. గురువారం రోజున అరటి చెట్టు పువ్వులను తీసుకుని వచ్చి నీడలో ఆరబెట్టి , కొత్త మట్టి కుండలో ఈ పువ్వులను వేసి పొయ్యిపై పెట్టి బాగా వేయించాలి. అరటి పువ్వులు పూర్తి స్థాయిలో నల్లగా మారిపోయిన తర్వాత మెత్తగా నూరి నూతన వస్త్రంలో వేసి జల్లించి మెత్తగా పొడి తయారు చేసుకోవాలి. ఈ పద్ధతిని ‘వస్త్ర కాయం’ అంటారు. ఈ పొడిలో కొద్దిగా పచ్చకర్పూరం, సింధూరం, గోరోజనం, తుంగ గడ్డల పొడి, కుంకుమ, కొద్దిగా పసుపు, ఆవు నెయ్యి, కొద్దిగా పసుపు నీరు పోసి బాగా కలిపితే అది తిలకం వలే తయారవుతుంది.
తిలక ధారణ ఇలా
ఈ తిలకాన్ని ఒక సీసాలో భద్రపరిచి దానిమ్మ పుల్ల, వెండి పుల్ల, బంగారు పుల్లతో నుదుటన బొట్టుగా పెట్టుకోవాలి. ప్రతి రోజు ఉదయం స్నానం చేసి శుచిగా పూజ జరుపుకోవడానికి వెళ్లే ముందు ఈ బొట్టును పెట్టుకొని పూజాదులు జరుపుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి.
అరటి పువ్వు తిలకధారణ ఫలం
రోజూ అరటి పువ్వు తిలకధారణ చేయడం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. వృత్తిలో పురోగతి, ధన లాభాలు కలుగుతాయి. వ్యాపారం విపరీతంగా అభివృద్ధి అవుతుంది. అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది. వివాహితులకు సత్సంతానం కలుగుతుంది. రాజకీయాలలో రాణించాలనుకునే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. పదవీయోగం కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అవుతుంది.
అరటి పువ్వు తిలకధారణ గురుగ్రహ దోషాన్ని నివారించే శక్తివంతమైన పరిహారంగా బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. శుభం భూయాత్!
