SGSTV NEWS online
CrimeTelangana

వైజాగ్ టు ముంబై వయా హైదరాబాద్.. రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఇద్దరు మహిళలు.. కట్ చేస్తే..



హైదరాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు.. లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి 21.251 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి గంజాయి తరలిస్తున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించగా, ఈ కేసులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.



డ్రగ్స్ అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను ఛేదించిన పోలీసులు.. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మే 29న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్వామి నేతృత్వంలో ఎన్‌డీపీఎస్ చట్టం కింద ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. క్లూస్ టీమ్ సిబ్బంది, మధ్యవర్తులతో కలిసి లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో నిఘా నిర్వహించారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సుమారు 4.25 గంటల సమయంలో మూడు సూట్‌కేసులతో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. వారి లగేజీలో ప్రత్యేకంగా దాచిపెట్టిన 19 ప్యాకెట్ల గంజాయిని గుర్తించారు. అరెస్టయిన మహిళలను నారాయణపేటకు చెందిన టిప్పిగిరి లక్ష్మి (43), సందీప్‌కౌర్ మక్కన్ సింగ్ (60)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరూ ముంబైలో నివాసం ఉంటున్నట్లు విచారణలో తేలింది.


పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. విశాఖపట్నానికి చెందిన శ్రీను అనే వ్యక్తి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ముంబైలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ వ్యవహారంలో బేబీ, సంపత్ అనే మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు వెల్లడించగా, వారు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 21.251 కిలోల గంజాయి, మూడు బ్యాగులు, రాకెట్ నిర్వహణకు ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.




ఇదిలా ఉండగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఈ అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts