నంద్యాల జిల్లా: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. అహోబిలం గ్రామానికి చెందిన బేరింగుల హరిస్వామి, వెంకటలక్ష్మీల కూతురు మోహిత (30) ఇంటర్ చదువుతున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన నేత పుల్లయ్య ప్రేమిస్తున్నాని వెంటపడ్డాడు. నీవు లేకుంటే చచ్చిపోతా.. నీవే సర్వస్వం అంటూ మాయమాటలు చెప్పాడు. చివరకు ఆమె ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో అతను మంచోడు కాదు, అందులోనూ కులాలు వేరని తల్లిదండ్రులు వారించారు. దీంతో ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లి పెళ్లి చేసుకుంది.
ఐదేళ్లపాటు సాఫీగా సాగిన సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే ఓ సంవత్సరం నుంచి తన నిజస్వరూపాన్ని బయటపెట్టిన పుల్లయ్య అనుచరుడుగా ఉంటున్న ఓ గిరిజన యువకుడి భార్యపై మోజు పడ్డాడు. ఆమెను అతనికి దూరం చేసి అనధికారికంగా విడాకులు ఇప్పించాడు. ఆమెను హరినగరం గ్రామంలో ఉంచి సహజీవనం చేస్తున్నాడు. అయినా మనసు సంపుకుని సంసారం చేస్తున్న మోహితకు ఈ మధ్య భర్తతోపాటు ఇంట్లో ఉన్న వారి వేధింపులు అధికమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది.
ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లి తన తల్లితో అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు.. నాకు బతకాలని లేదని చెప్పింది. అయితే అతను అధికార పార్టీకి చెందిన వాడు, మనం ఏమీ చేయలేము.. కేసు పెడదామన్నా మన మీదనే దాడి చేస్తారు. ఏదో విధంగా కొన్ని రోజులు సర్దుకుపోమని చెప్పి పంపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అందరూ చూస్తుండగానే విషం తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు నంద్యాల వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది.
నా కూతురు మృతిపై అనుమానాలు
పుల్లయ్య నా కుమార్తెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నా కూతురుపై వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ మధ్య మరో మహిళతో కాపురం చేస్తూ నా కూతురును కట్నం తేలదని వేధిస్తున్నాడు. ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానని గొడవ చేశాడు. అనుకోకుండా మందు తాగిందని, ఆసుపత్రికి తీసుకు పోతున్నామని చెప్పారు. అంతలోనే మృతి చెందిందని చెబుతున్నారు. ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయి. ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నిర్వహించి నా కుమార్తె మృతికి కారణమైన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి.
బేరింగుల హరిస్వామి, మృతురాలి తండ్రి
Also read
- అమ్మా.. పుల్లయ్య నన్ను మోసం చేశాడు..!
- 40 ఏళ్లనాటి పగ.. మద్యం సెట్టింగ్ వేసి.. ధావత్‌కు పిలిస్తే వెళ్లిన బీఆర్ఎస్ నేత.. ఇంతలో దారుణం..!
ఇలా తయారయ్యారేంట్రా..! టిఫిన్‌లో చట్నీ తక్కువైందని హోటల్ సిబ్బందిపై కత్తితో దాడి..!- నడిరోడ్డుపై మహిళ డ్రెస్సును పైకి లేపిన సైకోగాడు దొరికాడు.. పోకిరికి పోలీస్ స్టైల్ ట్రీట్మెంట్!
- హైదరాబాద్‌లో దారుణం.. లాయర్‌ను కారుతో ఢీకొట్టి..





