SGSTV NEWS online
Spiritual

Jyeshta Devi: మూదేవి అంటే దురదృష్టమా?.. మహాలక్ష్మి అక్క జ్యేష్ఠా దేవి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!



Moodevi Meaning: ‘మూదేవి’ అనే పదాన్ని చాలామంది తిట్టు పదంగా ఉపయోగిస్తుంటారు. కానీ అది నిజానికి మహాలక్ష్మి అక్కగా పూజించబడే జ్యేష్ఠా దేవి పేరు. క్షీరసాగర మథనం నుంచి ఆమె ఆవిర్భావం, ‘మూదేవి’ అనే పేరు వెనుక ఉన్న అసలు అర్థం, ప్రాచీన రాజులు చేసిన ఆరాధన, నేటికీ ఉన్న అరుదైన ఆలయాల గురించి ఈ కథనంలో తెలుసుకోండి.


Jyeshta Devi History: మనలో చాలామంది కోపంలో లేదా అవమానించాలనే ఉద్దేశంతో ‘మూదేవి'(జేష్ఠా దేవి) అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నిజానికి ‘మూదేవి’ అనేది తిట్టు పదం కాదు. అది ఒక పౌరాణిక దేవత పేరు. ఆమెనే జ్యేష్ఠా దేవి. పురాణాలు, శాసనాలు చెబుతున్న చరిత్రను తెలుసుకుంటే, ఈ పదాన్ని అవమానకరంగా ఉపయోగించడం ఎంత తప్పో అర్థమవుతుంది. తమిళనాడు ప్రాంతంలో జ్యేష్టా దేవిని ఎక్కువగా మూదేవిగా ఆరాధిస్తుంటారు.


క్షీరసాగర మథనంలో తొలి అవతారం

పురాణాల ప్రకారం, దేవతలు–అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మథించినప్పుడు అనేక దివ్య వస్తువులు, దేవతలు ఆవిర్భవించారు. వాటిలో మందార వృక్షం, పారిజాత వృక్షం, కామధేను, చంద్రుడు, ఐరావతం, ధన్వంతరి, అమృత కలశం, మహాలక్ష్మి వంటి దివ్య రూపాలు ఉన్నాయి. అయితే కొన్ని పురాణాల ప్రకారం, వీరందరికంటే ముందుగా జ్యేష్ఠా దేవి అవతరించిందని పేర్కొంటాయి. సంస్కృతంలో ‘జ్యేష్ఠ’ అంటే పెద్దది, మొదటిది అనే అర్థం. అందుకే ఆమెను మహాలక్ష్మికి అక్కగా భావించి పూజించే సంప్రదాయం ఏర్పడింది.

‘మూదేవి’ అనే పేరు ఎలా వచ్చింది?

మహాలక్ష్మి కంటే ముందుగా ప్రత్యక్షమైనందున ఆమెను ‘మూత దేవి’ (పెద్ద దేవి) అని పిలిచేవారు. కాలక్రమేణా అదే పదం ‘మూదేవి’గా మారింది. కాబట్టి ‘మూదేవి’ అనేది అవమానపరిచే పదం కాదు; ఒక గౌరవనీయమైన పౌరాణిక దేవత పేరు.



జ్యేష్ఠా దేవి స్వరూపం

జ్యేష్ఠా దేవి రూపం ఇతర దేవతలతో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది.

👉  చేతిలో చీపురు ఉంటుంది.

👉  కాకి ఆమె ధ్వజ చిహ్నంగా ఉంటుంది.

👉  గాడిద ఆమె వాహనంగా చిత్రీకరించబడుతుంది.

👉  కొన్ని శిల్పాల్లో కుమారుడు మంథన్, కుమార్తె మంతితో కలిసి కనిపిస్తుంది.

👉 మంథన్‌కు ఎద్దు ఆకార ముఖం ఉండటం విశేషంగా చెప్పబడుతుంది.

ప్రాచీన రాజ్యాల్లో విశేష ఆరాధన
నేటి కాలంలో జ్యేష్ఠా దేవి ఆరాధన ఎక్కువగా కనిపించకపోయినా, పల్లవులు, తొలి పాండ్యులు, చోళులు ఆమెకు అత్యంత గౌరవం ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. శాసనాలు, పురావస్తు పరిశోధనల ప్రకారం… రాజ్యం సుభిక్షంగా ఉండాలని, వ్యవసాయం అభివృద్ధి చెందాలని, దేశానికి స్థిరత్వం కలగాలని పల్లవ రాజులు జ్యేష్ఠా దేవిని ఆరాధించేవారు. చోళ రాజులు యుద్ధానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జ్యేష్ఠా దేవి సన్నిధిలో ఉంచి ఆశీర్వాదం పొందేవారని కూడా చారిత్రక కథనాలు చెబుతున్నాయి. దీంతో ఆమెను రక్షణ ప్రసాదించే దేవతగా భావించేవారని తెలుస్తోంది.

నేటికీ దర్శనమిచ్చే అరుదైన జ్యేష్ఠా దేవి ఆలయాలు
ఇప్పటికీ దేశంలోని కొన్ని పురాతన శివాలయాల్లో జ్యేష్ఠా దేవి శిల్పాలు, ప్రత్యేక సన్నిధులు కనిపిస్తాయి.

1. శ్రీ అరుణదీశ్వర ఆలయం – అరైయపాక్కం, చెంగల్పట్టు జిల్లా. ఈ ఆలయంలో వాయువ్య దిశలో జ్యేష్ఠా దేవికి ప్రత్యేక సన్నిధి ఉంది. ఇక్కడ ఆమె కాకి ధ్వజంతో, అందమైన శిల్పరూపంలో దర్శనమిస్తుంది.

2. అనూర్ పురాతన శివాలయం – చెంగల్పట్టు జిల్లా. ఈ ఆలయంలో కూడా జ్యేష్ఠా దేవి అరుదైన ఉబ్బెత్తు శిల్పం కనిపిస్తుంది.

3. శ్రీ ముక్తీశ్వర ఆలయం – అత్తూరు, చెంగల్పట్టు జిల్లా శ్రీ ధర్మసంవర్తిని అంబాళ్ సమేత ఈ ఆలయంలో జ్యేష్ఠా దేవిని వ్యవసాయ సంరక్షక దేవతగా, ఐశ్వర్యాన్ని ప్రసాదించే అధిదేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఆమెను భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని స్థానిక విశ్వాసం.

4. సేలం జ్యేష్ఠా దేవి ఆలయం: సేలంలో జ్యేష్ఠా దేవికి అంకితమైన ప్రత్యేక ఆలయం ఉంది. ఈ ఆలయం ఆమె ఆరాధనకు సంబంధించిన అరుదైన క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

‘మూదేవి’ అని తిట్టడం సరైనదేనా?


చరిత్ర, పురాణాలను పరిశీలిస్తే ‘మూదేవి(జ్యేష్ట)’ అనే పదం అసలు అవమానకరమైనది కాదని స్పష్టమవుతుంది. అది మహాలక్ష్మికి అక్కగా భావించబడే జ్యేష్ఠా దేవి పేరు. కాలక్రమేణా ప్రజల వాడుకలో ఈ పదానికి ప్రతికూల అర్థం వచ్చినప్పటికీ, దాని అసలు నేపథ్యం ఎంతో గౌరవప్రదమైనది. అందుకే ఈ పదాన్ని తిట్టు పదంగా ఉపయోగించే ముందు దాని చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యతను తెలుసుకోవడం అవసరం.

Related posts