సినిమాల్లో మాత్రమే చూసే గుప్తనిధుల వేట.. ఇప్పుడు నిజంగానే కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో కలకలం రేపింది. ఓ పురాతన ఇంటిని టార్గెట్‌గా చేసుకుని కొందరు వ్యక్తులు పట్టపగలే రహస్య తవ్వకాలు చేపట్టడం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. బుధవారం ఉదయాన్నే పలు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఖరీదైన కార్లలో పునాదిపాడు గ్రామం చేరుకున్నారు. వారి చేతుల్లో ల్యాప్‌టాప్‌లు, ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు, తవ్వకాల సామగ్రి ఉండటంతో మొదట నుంచే అనుమానాలు మొదలయ్యాయి. అంతలోనే వారు గ్రామంలోని ఓ పురాతన ఇంటిలోకి వెళ్లి తవ్వకాలు ప్రారంభించారు. ఇంటి ఆవరణలో పెద్ద ఎత్తున గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. ఏదో ప్రత్యేక పరికరాలతో భూమిని పరిశీలిస్తూ.. తవ్వకాలు జరుపుతూ అక్కడే ఏదో వెతుకుతున్నట్టుగా కనిపించారని స్థానికులు చెబుతున్నారు..
అయితే.. ఈ విషయం టీవీ9కు చేరడంతో మా బృందం స్పాట్‌కు వెళ్లింది. అక్కడ ఏం జరుగుతోందని ప్రశ్నించగానే.. తవ్వకాలు చేస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడకుండా ఉండిపోయి.. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడికి వేసుకువచ్చిన కార్లను కూడా అక్కడే వదిలేసి పరారయ్యారు. దీంతో అక్కడి సీన్ మరింత హైటెన్షన్‌గా మారింది. గ్రామస్థులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
స్థానికులు మాత్రం ఇది గుప్తనిధుల వేటేనని బలంగా అనుమానిస్తున్నారు. పురాతన ఇంటి కింద నిధులు ఉన్నాయన్న సమాచారంతోనే టెక్నాలజీ పరికరాల సహాయంతో తవ్వకాలు చేపట్టినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అక్కడ వదిలి వెళ్లిన కార్లు, పరికరాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారైన వ్యక్తులు ఎవరు.. అసలు వారు ఏం వెతుకుతున్నారు. నిజంగానే గుప్తనిధుల కోసమే తవ్వకాలు జరిగాయా.. అన్న కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also read
- ఘోరం.. కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపి.. కొడుకు ఆత్మహత్య! కారణం అదేనా?
- Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..
- Hyderabad: కామంతో రెచ్చిపోయాడు.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్..
- అమానుషం…చోరీ నెపంతో ఎనిమిదేళ్ల బాలికపై చిత్రహింసలు, అట్లకాడతో వాతలు..
- Rajanagaram: గోదావరిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి





