SGSTV NEWS online
Andhra PradeshCrime

కోనసీమలో పెళ్లి విందులో ఫుడ్ పాయిజన్ – 39 మందికి అస్వస్థత


కోనసీమ జిల్లా రామ్మోహనరావుపేటలో వాంతులు, విరోచనాలతో విలవిలలాడిన బాధితులు – కొత్తపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపు – అస్వస్థతకు గురైన వారిలో ఆరుగురు గర్భిణులు – మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు

సంతోషంగా సాగుతున్న ఆ పెళ్లి వేడుకలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అందరూ విందు భోజనం చేసిన కాసేపటికే వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కడుపునొప్పితో జనం విలవిలలాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గురువారం జరిగిన ఒక వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్ ఏకంగా 39 మందిని ఆసుపత్రి పాలు చేసింది. కొత్తపేట మండల పరిధిలోని రామ్మోహనరావుపేటలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అప్రమత్తమైన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.

పెళ్లి భోజనం, ప్రాణ సంకటం! : కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి సమీపంలోని రామ్మోహనరావుపేటలో ఒక వివాహ వేడుక జరిగింది. గ్రామానికి చెందిన గిడ్డి శాంతారావు తన కుమార్తె వివాహాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు బంధువులు, మిత్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెళ్లి అనంతరం అందరూ ఎంతో సంతోషంగా విందు భోజనాలు చేశారు. అయితే భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురిలో అస్వస్థత లక్షణాలు కనిపించాయి. ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. ఇలా ఏకంగా 39 మంది అస్వస్థతకు గురికావడంతో పెళ్లింట తీవ్ర ఆందోళన నెలకొంది.

ఆసుపత్రులకు పరుగులు, గర్భిణుల తరలింపు : బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్రమత్తమయ్యారు. తొలుత బాధితులందరినీ వానపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించారు. అక్కడ వైద్యులు బాధితులకు ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, మెరుగైన చికిత్స కోసం మూడు అంబులెన్సులను రప్పించారు. బాధితులను కొత్తపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి (సీహెచ్‌సీకి) తరలించారు. అయితే, అస్వస్థతకు గురైన 39 మందిలో ఆరుగురు గర్భిణీ స్త్రీలు ఉన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, వెంటనే వారిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

నిలకడగా ఆరోగ్యం, పర్యవేక్షిస్తున్న నిపుణులు : కొత్తపేట సీహెచ్‌సీలో చేరిన బాధితులకు వైద్యులు తక్షణమే మెరుగైన వైద్య సేవలు ప్రారంభించారు. ఫుడ్ పాయిజన్ వల్ల విరేచనాలు, వాంతులు కావడంతో బాధితులు నీరసించిపోకుండా వెంటనే ఫ్లూయిడ్స్ (సెలైన్లు) ఎక్కించారు. ఆసుపత్రిలో చేరిన బాధితుల వయసు నాలుగేళ్ల చిన్నారి నుంచి 55 ఏళ్ల వృద్ధుల వరకు ఉంది. వీరికి వైద్యం అందించేందుకు ప్రత్యేక నిపుణుల బృందాన్ని రంగంలోకి దించారు. జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, పీడియాట్రిక్ (చిన్నపిల్లల) వైద్యులు బాధితులకు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న బాధితులందరి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

ఆదేశాలు జారీ చేసిన మంత్రి సత్యకుమార్ : కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన జిల్లా వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కొత్తపేట సీహెచ్‌సీలో చేరిన బాధితులకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్యం అందించడంలో ఎలాంటి లోపం జరగకూడదని, ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలతో వైద్యులు ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్ల మొత్తం 28 మంది సీహెచ్‌సీలో అడ్మిట్ అయ్యారని, అందరికీ ఫ్లూయిడ్స్ ఇచ్చామని, ప్రస్తుతం ప్రాణాపాయం లేదని వైద్యులు మంత్రికి నివేదించారు.

Also read

Related posts