భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందన్న మనస్థాపంతో ఓ భర్త సెల్ ఫోన్ టవర్ ఎక్కి దాదాపు గంట పాటు వీరంగం సృష్టించాడు.
భూదాన్ పోచంపల్లి: భార్య అలిగి పుట్టింటికి
వెళ్లిందన్న మనస్థాపంతో ఓ భర్త సెల్ ఫోన్ టవర్ ఎక్కి దాదాపు గంట పాటు వీరంగం సృష్టించాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కప్రాయపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగాదేవి సాయి ప్రకాష్ (27) వృత్తిరీత్యా జెసిబి డ్రైవర్గా పనిచేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. గత నాలుగేళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన కొండ్రు స్వాతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే, సాయి ప్రకాష్ తరచూ మద్యం తాగి రావడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త వేధింపులు తాళలేక ఈ నెల 2 న స్వాతి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, తన పుట్టింటికి వెళ్లిపోయింది.
భార్య హామీ ఇవ్వడంతో టవర్ దిగిన సాయి ప్రకాష్
భార్య వెళ్ళిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి ప్రకాష్ మంగళవారం మద్యం మత్తులో గ్రామ శివార్లలోని సెల్ ఫోన్ టవర్ ఎక్కాడు. “నా భార్య నాకు కావాలి.. తను వస్తేనే కిందకు దిగుతా” అంటూ హంగామా చేశాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. కానీ సాయి ప్రకాష్ మొండికేయడంతో గంటల తరబడి హైడ్రామా కొనసాగింది. చివరికి తన బావ సాయంతో భార్య స్వాతికి ఫోన్ చేసి కాన్ఫరెన్స్లో మాట్లాడించారు. నేను ప్రస్తుతం ఆంధ్రాలో ఉన్నాను.. రేపు ఇంటికి వస్తాను అని భార్య హామీ ఇవ్వడంతో సాయి ప్రకాష్ టవర్ దిగి వచ్చాడు. అయితే టవర్ దిగిన తర్వాత అతను గ్రామస్తుల వైపు రాకుండా, నేరుగా బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు.
Also read
- ముగ్గురు అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి
- గోదావరిలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం
- ‘మా అల్లుడు సైకో’.. టెకీ రాధా గాయత్రి తల్లిదండ్రులు
- నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణం
- కన్నబిడ్డలతో రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య





