SGSTV NEWS online
Andhra PradeshCrimeInternational

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య..

కుటుంబ పోషణ కోసం గల్ఫ్‌కు వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు తెలుగు ప్రవాసీయులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో యువతి మృతదేహాన్ని స్వదేశానికి పంపిస్తామని అన్నారు.

కుటుంబ బాధ్యతలు, తోబుట్టువుల బంగారు భవిష్యత్తు కోసం తమ కలలను కాలరాసి యుక్త వయస్సులోనే ఎడారి బాట పట్టే వారిలో యువకులతో పాటు యువతులు కూడా ఉన్నారు. తమ అక్కాచెల్లెళ్ల కోసం అరబ్బునాట అడుగు పెట్టే ఆంధ్రా మహిళలకు కొదవే లేదు. కొందరు తల్లులు తమ బిడ్డల కోసం, మరి కొందరు అక్కాచెల్లెళ్లు, తమ తోటి వారి కోసం వలస బాటను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు తనవు చాలిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరం మండలానికి చెందిన వర్ధనపు కవిత అనే 21 ఏళ్ళ యువతి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్‌గా విద్యనభ్యసించింది. కుటుంబ బాధ్యతల కారణంగా నాలుగు నెలల క్రితం బహ్రెయిన్‌కు వెళ్లింది. నలుగురు చెల్లెళ్లు, తల్లి మాత్రమే ఉన్న ఆమె తన అర్హతలకు తగినట్లుగా వైద్య రంగంలో కాకుండా, ఒక అరబ్బు యజమాని ఇంట్లో మెయిడ్‌గా పని చేయడానికి వెళ్లింది. కవిత గత నెల 23న తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కవితది ఆత్మహత్య అని పోలీసు విచారణలో, వైద్య పరీక్షల్లో కూడా తేలింది

బహ్రెయిన్‌తో పాటు గల్ఫ్ ప్రాంతంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో విమాన టికెట్ల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మృతదేహాన్ని స్వదేశానికి పంపించడానికి అవసరమైన శవపేటిక ప్యాకింగ్ ఏర్పాట్లు, విమాన ఖర్చులను భరించడానికి యజమాని నిరాకరించారు. దీంతో, బహ్రెయిన్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా ప్రవాసీయులు కొందరు తమ వంతుగా ముందుకు వచ్చి చేయూతనివ్వడంతో మృతదేహం తరలింపునకు మార్గం సుగమమైంది. యు.ఎ.ఇకి చెందిన ఎయిర్ అరేబియా ద్వారా మృతదేహం స్వదేశానికి చేరాల్సి ఉన్నా ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా విమానం రద్దైంది. దీంతో కొంత జాప్యం జరిగింది.

అయితే, బహ్రెయిన్‌లో పని చేసే జిల్లాకు చెందిన బొక్క గిరిబాబు, సత్యనారాయణ, రమణ, తెలుగు చర్చి సభ్యులతో పాటు యజమాని కూడా కొంత మొత్తాన్ని ఇచ్చారు. త్వరలోనే మృతదేహాన్ని స్వదేశానికి తరలించడానికి ఏర్పాట్లన్నీ పూర్తవుతాయని బొక్క గిరిబాబు తెలిపారు. ప్రవాసంలో ఎక్కడైనా సరే తమ జిల్లావాసుల కోసం అందరూ ముందుకు వస్తామని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ప్రవాసీ ప్రముఖుడు వెంకటేశ్వరరావు రాయుడు అన్నారు.

Also read

Related posts