SGSTV NEWS online
CrimeTelangana

ఆ.. ఇంట్లో ఏమైందో?

ఖమ్మం : ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి, అతని కుమార్తె విగత జీవులయ్యారు. ఘటనా స్థలిలోనే అపస్మారక స్థితిలో ఉన్న అతని భార్య, గాయపడ్డ చిన్న కుమార్తెను గుర్తించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన కణతాల రాము(30) ఓ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు. ఇతని భార్య పేరు రమ్య(28). వీరికి దివ్యశ్రీ (5), రితిక (3) ఇద్దరు కుమార్తెలు. రాము తన కుటుంబంతో కలిసి ఖమ్మం నగరం మామిళ్లగూడెంలోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అతను ఉండే ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో సమీపంలోని వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించగా రాము, అతని పెద్దకుమార్తె దివ్యశ్రీ చనిపోయి ఉన్నారు. వారి పక్కన భార్య రమ్య అపస్మారక స్థితిలో ఉన్నారు. చిన్న కుమార్తె రితిక తలకు గాయంతో బిక్కుబిక్కుమంటూ చూస్తూ కనిపించింది. నోటి నుంచి నురగ వస్తున్న రమ్యని, గాయపడిన రితికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రెండ్రోజుల క్రితం మృతి!

మృతదేహం పూర్తిగా పాడైపోవటంతో రాము రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు భావిస్తున్నామని, కుమార్తె దివ్య ఈ రోజు చనిపోయి ఉంటుందని ఖమ్మం ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ బాలకృష్ణ తెలిపారు. రాము మృతదేహం వద్ద రక్తపు మరకలు కనిపించాయని, గాయంతో ఏర్పడ్డవా? శరీరం నుంచి వచ్చిన ద్రవాలా స్పష్టం కావాల్సి ఉందన్నారు. దివ్యశ్రీ శరీరంపై అంతర్గత గాయాలున్నాయన్నారు. ఇదిలా ఉండగా భార్యాభర్తల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకున్నట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు.

రమ్య ఆదివారం కూడా బయట నీరసంగా తిరిగిందని, పురుగుమందు కొనుగోలు చేసి ఆత్మహత్యాయత్నం చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. రమ్య కోలుకుంటే వివరాలు తెలిసే అవకాశం ఉందని ఏసీపీ చెప్పారు.

Also read

Related posts