మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో పాత కక్షలు భగ్గుమన్నాయి.. హరిచంద్ తండాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారి..పరస్పర దాడులకు దారితీసింది. ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి..ఈ ఘటన తండాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కౌడిపల్లి మండలం హరిచంద్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రాందాస్ నరేందర్, దాసురు స్వరూప, రవీ, రెడ్యా వర్గానికి.. అదే తండాకు చెందిన లక్ష్మణ్, గణేష్, కవిత, రూంసి, రాహుల్, దశరథ్, కంసి, రవీందర్ వర్గానికి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి..పాత కక్షలను మనసులో పెట్టుకున్న ఇరు వర్గాలు ఆదివారం మరోసారి వాగ్వాదానికి దిగాయి..ఇది కాస్తా ముదిరి పరస్పర దాడులకు దారితీసింది.
ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఇనుప రాడ్లు, ఖాళీ సీసాలతో విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. గొడవ అంతటితో ఆగకుండా.. రోడ్లపై ఉన్న వాహనాలు, పశువుల కొట్టాలు, ఇళ్లపై కూడా దాడి చేసి ధ్వంసం చేశారు..ఈ భీకర దాడిలో ఇరు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, కౌడిపల్లి ఎస్సై అమరేందర్ రెడ్డి హుటాహుటిన తండాకు చేరుకున్నారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు సేకరించారు..ప్రస్తుతం కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ గొడవకు ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు..తండాలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టారు.
Also read
- Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు.. ఇంట్లోంచి 7 కిలోల వెండి, 90 గ్రాములు బంగారం మాయం..
- భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెళ్లిన NRI భర్త.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం
- బ్యాగులతో హాయిగా వస్తున్నారు.. పోలీసులను చూసి లగెత్తారు.. అనుమానం వచ్చి పట్టుకుంటే..
- ఇంటర్నెట్ టెక్నీషియన్ అంటూ వ్యాపారికి టోకరా.. ఇతని కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి..
- పండగ వేళ విషాదం.. డీజే మోతకు ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు..





