శుభకార్యానికి వెళ్లిన మహిళ… తిరిగొచ్చేసరికి జీవితం రోడ్డుపై పడింది. 15 తులాల బంగారం మిస్సయిందన్న కారణంతో భర్త ఇంట్లోకి అనుమతించకపోవడం… చేతిలో మూడు నెలల శిశువుతో ఇంటి ముందు కూర్చున్న కరిష్మా గాథ హృదయాలను కలిచివేస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల …
బంగారం పోగొట్టుకోవడం.. ఆ తర్వాత జీవితమే రోడ్డుపై పడటం.. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ ఎదుర్కొంటున్న విషాద గాథ ఇది. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన కరిష్మా అనే మహిళ.. తన తల్లితో కలిసి ఓ శుభకార్యానికి కనేకల్‌కు వెళ్లింది. మార్గమధ్యంలో బస్సు, ఆటోల్లో ప్రయాణిస్తూ అక్కడికి చేరుకుంది. శుభకార్యంలో ఆభరణాలు ధరించేందుకు బ్యాగ్ తెరిచి చూసేసరికి.. బంగారు ఆభరణాలు ఉన్న పెట్టె కనిపించలేదు. దాదాపు 15 తులాల బంగారం మిస్సయిందని గ్రహించిన కరిష్మా, ఆమె తల్లి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అనంతరం కళ్యాణదుర్గంలోని ఇంటికి చేరుకున్న కరిష్మాకు మరో షాక్ ఎదురైంది. భర్త మహమ్మద్ గౌస్.. పోయిన బంగారం తీసుకువచ్చే వరకు ఇంట్లోకి రానివ్వనని హుకుం జారీ చేశాడు.
దీంతో కరిష్మా పోలీసులను ఆశ్రయించింది. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఘటన కనేకల్ పరిధిలో జరిగిందని అక్కడే ఫిర్యాదు చేయాలని సూచించారు. కనేకల్ పోలీసులను ఆశ్రయించగా.. 15 తులాల బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో.. కేవలం 3 తులాల మేరకే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఈ పరిణామాలతో తీవ్రంగా మానసికంగా కుంగిపోయిన కరిష్మా.. మూడు నెలల పసికందును ఎత్తుకుని భర్త ఇంటి ముందే భైఠాయించింది. భర్త ఇంట్లోకి అనుమతించకపోవడం.. తల్లిదండ్రులు కూడా సరైన స్పందన ఇవ్వకపోవడంతో.. ఆమె నిస్సహాయ స్థితిలో బయటే కూర్చుంది.
ఒకవైపు పోయిన బంగారం బాధ.. మరోవైపు కుటుంబ సహాయం లేకపోవడం.. కరిష్మా పరిస్థితిని మరింత దయనీయంగా మార్చాయి. చిన్న అజాగ్రత్త ఒక మహిళ జీవితాన్ని ఇలా రోడ్డున పడేసిందా అన్న ప్రశ్న స్థానికులను కలిచివేస్తోంది.
Also read
- ఛీ ఛీ.. నువ్వేం మనిషివిరా.. భార్యపై కోపంతో కూతురిని చంపాడు.. బైక్‌పై తీసుకెళ్లి..
- విశాఖలో యువతి అనుమానాస్పద మృతి… పార్టీ నుంచి లాడ్జి వరకు ఏమైంది?
- ఉద్యోగం అన్నాడు.. ప్రేయసి నుంచి రూ.18 లక్షలు కాజేశాడు.. కట్‌చేస్తే..
- అడుగు భూమికోసం ఇంత దారుణమా.. ఈ బుడ్డోడు ఏం చేశాడో తెలిస్తే..
- వారు బైక్‌పై ఇద్దరు వస్తున్నా.. రాత్రి సమయం అని ఇతనికి లిఫ్ట్ ఇచ్చారు.. కానీ కాసేపటికే..





