అతను ఓ బ్యాంకులో కాంట్రాక్టు ఉద్యోగి. ఈజీ మనీ కోసం అలవాటు పడ్డాడు. ఎలాగైనా భారీగా సంపాదించాలనుకున్నాడు. పథకం వేశాడు. తాను పని చేసే బ్యాంకునే బురిడీ కొట్టించాడు. 2.65 కోట్ల రూపాయలు స్వాహా చేశారు. ఆ బ్యాంకు ఉద్యోగి.. బ్యాంకును ఎలా బురిడీ కొట్టించాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా దేవరకొండలో SBI బ్యాంకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తోంది. దేవరకొండకు చెందిన చక్రపాణి డిగ్రీ చదివాడు. SBI దేవరకొండ బ్రాంచ్‌లో కాంట్రాక్ట్ విధానంపై అటెండర్‌గా మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. బ్యాంక్ సిబ్బందితో సఖ్యతగా మెలిగి చక్రపాణికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో సిబ్బంది పనులు చెప్పేవారు. కేవైసీ అప్‌డేట్ తదితరాల పనులను తమ ఐడీలతో బ్యాంకు సిబ్బంది చక్రపాణితో చేయించేవారు. ఇందుకోసం బ్యాంకు ఉద్యోగుల కంప్యూటర్లలో ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యేవాడు.
ఎలాగైనా బ్యాంకును బురిడీ కొట్టించి కోట్లు సంపాదించాలనుకున్నాడు. సుదీర్ఘకాలం ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా స్తబ్ధుగా మొబైల్ నెంబర్ లేని బ్యాంకు ఖాతాలపై అతని కన్నుపడింది. బ్యాంకు సిబ్బంది భోజనానికి వెళ్లిన సమయంలో వారి కంప్యూటర్లలో ఐడీ, పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయి ఇతర జిల్లాల్లోని ఎస్బీఐ శాఖల్లో స్తబ్దుగా, ఫోన్ నంబర్ లేని ఖాతాల వివరాలు సేకరించాడు.
చక్రపాణి ఆ ఖాతాల కేవైసీ కోసం అవసరమైన డాక్యుమెంట్ల సేకరించి తన ఫోన్ నెంబర్‌ను అప్‌డేట్ చేశాడు. నెట్ బ్యాంకింగ్ ద్వారా హైదరాబాద్, వరంగల్ శాఖలలోని కొందరి ఖాతాల నుండి డబ్బును తన మిత్రుల ఖాతాల్లోకి బదిలీ చేసేవాడు. తర్వాత వారి నుంచి తన ఖాతాకు బదిలీ చేయించుకునేవాడు. ఇలా పలువురి ఖాతాదారుల నుంచి రూ.2.65 కోట్లు స్వాహా చేశాడు. ఈ క్రమంలో హైదరాబాద్ ఎస్‌బీఐ శాఖకు చెందిన ఓ కస్టమర్ ఖాతా నుంచి నగదు బదిలీ చేయగా,మెసేజ్ రావడంతో ఖాతాదారుడు బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమై బ్యాంకు అధికారులు ‘తీగ లాగితే డొంక కదిలినట్లు’ దేవరకొండ ఎస్బీఐ బ్రాంచి నుంచి ఆపరేటింగ్ చేస్తూ స్వాహా అయినట్లు గుర్తించడంతో చక్రపాణి మోసం బయట పడింది.
బ్యాంక్ అధికారులు క్రపాణి బ్యాంకు ఖాతాను పరిశీలించగా.. హైదరాబాద్, వరంగల్, వివిధ శాఖలకు చెందిన పలువురి ఖాతాదారుల నుంచి రూ.2.65 కోట్లు బదిలీ చేసినట్లు తేలింది. అతడి స్నేహితుడి ఖాతాలో రూ.89 లక్షలు ఉండటంతో దాన్ని ఫ్రీజ్ చేశారు. ఈ ఘటనపై బ్యాంకు మేనేజర్ ఫణీంద్ర ఇచ్చిన ఫిర్యాదుతో దేవరకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టు ఉద్యోగి చక్రపాణి పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ కథనం ద్వారా తెలిసేది ఏంటంటే, డిజిటల్ కాలంలో కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు. గోప్యత (Privacy) కూడా అంతే ముఖ్యం. బ్యాంకు సిబ్బంది తమ లాగిన్ వివరాలను ఒక కాంట్రాక్టు ఉద్యోగికి ఇవ్వడం అనేది నిబంధనలకు విరుద్ధం మాత్రమే కాదు, కోట్లాది రూపాయల ప్రజా ధనానికి ముప్పు కూడా.
Also read
- మరోసారి బయటపడ్డ సుకేష్ గుప్తా ‘గోల్డ్ మాల్’.. ఏకంగా నిజాం నగలకే ఎసరు..!
- ఏంటక్కా ఇది.. టిప్‌టాప్‌గా కారు దిగింది.. ఆ తర్వాత లవర్ కోసం చేయకూడని పని చేసి..
- వాడంతే.. అదో టైపు.. దొంగతనం చేస్తాడు.. ఇట్టే దొరికిపోతాడు..
- షాకింగ్.. 180 మంది అమ్మాయిల 350 వీడియోలు తీసి.! ఆ తర్వాత..
- ఇదేం ట్విస్ట్.. అత్తింటి వేధింపులు భరించలేక అల్లుడు సూసైడ్.. సెల్పీ వీడియో కలకలం





