SGSTV NEWS online
Andhra PradeshCrime

యువ న్యాయవాది హత్య.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ



చిలకలూరిపేట , : పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో శుక్రవారం ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం.. ఒంగోలు పట్టణం కర్నూలు రోడ్డులో నివాసం ఉండే హరిప్రసాద్ అక్కడ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం హైకోర్టుకు వెళుతున్నానని ఇంటి వద్ద చెప్పి బయల్దేరారు. ఆ తర్వాత రాత్రి 8.43 సమయంలో ఇంట్లో వారితో ఫోన్లో మాట్లాడారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్య హత్య జరిగి ఉండవచ్చని, కానీ రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు చిత్రీకరించారని పోలీసులు భావిస్తున్నారు. స్కూటీ రోడ్డు పక్కన పడి ఉంది. దాని కింద హరిప్రసాద్ నిర్జీవంగా పడిఉన్నారు. మృతుడి తలపై కొట్టినట్లు గాయం ఉంది. క్లూస్ట్రమ్, ఫోరెన్సిక్ బృందాలతో పాటు పోలీసు జాగిలాలను ఘటనా స్థలానికి రప్పించారు. నరసరావుపేటలో బంధువులకు రాత్రి సమయంలో హరిప్రసాద్  కనిపించినట్లు సమాచారం. హరిప్రసాద్ ప్రయాణిస్తున్న స్కూటీని మరో ద్విచక్రవాహనం అనుసరించినట్లు నరసరావుపేట-చిలకలూరిపేట మార్గంలో సీసీ ఫుటేజ్లో నమోదైనట్లు తెలిసింది. హరిప్రసాద్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భూ వివాదమే న్యాయవాది హత్యకు కారణమా?

ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ఒంగోలులోని ఒక భూ వివాదం నేపథ్యంలో శ్రీరామ హరిప్రసాద్ హత్యకు గురై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంగోలు కేశవరాజుకుంట సమీపంలోని ఒక స్థలం విషయంలో ఇటీవల వివాదం నెలకొంది. ఆ భూమిలో తాము 20 ఏళ్ల నుంచి నివసిస్తున్నామని స్థానికుడు పోతురాజు చెబుతున్నారు. ఈ స్థలం తనకు చెందినదని హైదరాబాద్కు చెందిన రాఘవేంద్రరావు వాదన. భూమిని కొందరు ఆక్రమించారంటూ వీఆర్వో ఒకరు ఒంగోలు తాలూకా పోలీసులకు మార్చి 5న ఫిర్యాదు చేశారు. రాఘవేంద్రరావు తరపున ఒంగోలుకు చెందిన ఒకరు రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేసు నమోదు చేశారు. దీంతో పోతురాజుతో పాటు ఆయనకు బంధువైన న్యాయవాది హరిప్రసాద్ ఒక వీడియోను విడుదల చేశారు. స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన పలువురు బెదిరిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలంటూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను అభ్యర్థించారు. ఈ కేసులో హరిప్రసాద్ న్యాయపోరాటం చేస్తున్నారు.

Also read

Related posts