SGSTV NEWS online
Andhra PradeshCrimeNational

ఏపీకి చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్య.. కంపెనీలో చేరిన పది రోజుల్లోనే



పది రోజుల కిందటే ఉద్యోగం కోసం హర్యానా వెళ్లిన ఓ టెకీ.. అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన బండ్ల రిషికేష్.. పంచకులలోని వేది టెక్నాలజీస్‌లో ఏప్రిల్ 1 న జాయిన్ అయ్యాడు. నాలుగు రోజుల తర్వాత ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ, అతడు గదిలో కత్తిపోట్లతో విగతజీవిగా మారాడు. తొలుత దీనిని ఆత్మహత్యగా పోలీసులు భావించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెకీ హర్యానాలో దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా గుడివాడ బేతవోలుకు చెందిన బండ్ల రిషికేష్ (27) పది రోజుల కిందటే హర్యానా పంచకులలోని ‘వేది టెక్నాలజీస్’ అనే సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‌గా చేరారు. మార్చి 30 హైదరాబాద్ నుంచి బయలుదేరిన రిషికేష్.. ఏప్రిల్ 1న రిపోర్ట్ చేశారు. ఈ క్రమంలో పంచకులలోని పింజోర్ అమరావతి ప్రాంతంలో ఓ గదిని ఏప్రిల్ 4న అద్దెకు తీసుకున్నాడు. అయితే, గురువారం ఉదయం చాలా సేపటి వరకూ టెకీ బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని తలుపుకొట్టాడు. అయినా లోపలి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన ఆందోళనకు గురైన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకుని తలుపులను తెరిచి చూడగా రిషికేష్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.

ఘటనా స్థలంలో ఒక కూరగాయల కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిపై రక్తపు మరకలు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఆ గదిలో హతుడి మొబైల్‌తో పాటు మరో ఫోన్‌ కూడా లభ్యమైంది. ఆ ఫోన్ లాక్ చేసి ఉండటంతో, ఎటువంటి సమాచారం లభించలేదని పోలీసులు తెలిపారు. రిషికేష్ కుటుంబానికి పోలీసులు సుమారు 50 సార్లు ఫోన్ చేసినా.. కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. దీంతో గుడివాడ పోలీసులకు ఈ సంఘటన గురించి సమాచారం అందించారు. రిషికేష్ తల్లిదండ్రులకు గుడివాడ వన్‌టౌన్ పోలీసులు ఈ వార్తను చేరవేశారు. ఉన్నత చదువులు చదివిన కొడుకు తమ కష్టాలను తీర్చుతాడని ఏన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని వేదన మిగిల్చింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు హర్యానాకు బయలుదేరి వెళ్లారు.



ఇదిలా ఉండగా, ఆ గదిలోని గోడలపై రక్తంతో ఇంగ్లీషు, ఇతర భాషలలో రాసిన సందేశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ సందేశాన్ని అర్థంచేసుకోవడానికి తాము ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంగ్లీషులో ఉన్న ఒక్క లైన్ ‘‘నేను పోలీసులకు ఫోన్ చేయలేకపోతున్నాను’’ అని స్పష్టంగా ఉంది. తొలుత అతడు కత్తితో పొడుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావించారు. కానీ, రిషికేష్ ఒంటిపై ఉన్న గాయాలను తీరును బట్టి అది హత్యగా నిర్దారణకు వచ్చారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. రుషికేశ్ చివరిగా ఎవరితో మాట్లాడాడు.? గదికి ఎవరెవరు వచ్చారు..? అనేది ఆరా తీస్తున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. అటు, కుటుంబసభ్యుల సైతం తమ కుమారుడిది ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనస్తత్వం కాదని చెబుతున్నారు

Also read

Related posts