నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఈ నెల 3వ తేదిన రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. అది రోడ్డు ప్రమాదం కాదని పక్కా స్కెచ్‌తో చేసిన హత్యని తేలింది. తొలుత రోడ్డు ప్రమాదంగా ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేసిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. పక్కా ఆధారలతో ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని పోలీసులు గుర్తించారు.
వెల్దండ మండల కేంద్రానికి చెందిన రుద్రాక్షల మహేశ్(30) పశువులు, పందులను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే ఈ నెల 3వ తేదిన రాత్రి తన వ్యక్తిగత పనుల నిమిత్తం కారులో వెల్దండ నుంచి పొలం వద్దకు బయలుదేరాడు. ఈ క్రమంలో పోతపల్లి వెళ్లే రహదారిపై కంకర క్రషర్ సమీపానికి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్ వేగంగా వచ్చి మహేశ్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ కాగా మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత కాసేపటికే ప్రాణాలు కోల్పోయాడు.
అయితే అందరూ మొదటి రోడ్డు ప్రమాదంలోనే మహేశ్ చనిపోయాడని భావించారు. ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానులు తెలపడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్ఐ కురుమూర్తితో పాటు ఫోరెన్సిక్ టీం ఘటనాస్థలిని పరిశీలించారు. దీనికి తోడు మహేశ్ తలపై బండరాళ్లతో కొట్టిన ఆనవాళ్లను గుర్తించారు. కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేయగా మహేశ్ దాయాదులు వెంకటమ్మ కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అలాగే జరిగింది యాక్సిడెంట్ కాదు… పక్కా ప్రణాళికతో మహేశ్ ను హత్య చేశారని తేల్చారు.
రోడ్డు ప్రమాదంలో మహేశ్ తీవ్రగాయాలతో బయటపడగా దాయాదులు మహేశ్ తలపై బండరాళ్లతో కొట్టి హతమార్చారు. అనంతరం రోడ్డు ప్రమాదంలోనే మహేశ్ ప్రాణాలు కోల్పోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన తర్వాత దాయాదులు పరారీలో ఉన్నారు. మహేశ్ ను హత్య చేసేందుకు టిప్పర్ వాహనాన్ని కల్వకుర్తిలో అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు గతేడాది ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది.
అయితే గతకొన్నాళ్లుగా దాయాదులు రుద్రాక్షల కృష్ణయ్య, వెంకటమ్మ కుటుంబ సభ్యులతో భూతగాదాలు ఉన్నట్లు మహేశ్ కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే నిందితులు గతేడాది చేసిన ఓ మర్డర్ కేసులోనూ మహేశ్ సాక్షిగా ఉన్నాడు. దీంతో మహేశ్ వారికి అడ్డుగా ఉన్నాడన్న నేపంతోనే హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also read
- గొల్కొండలో తారామతి బారాదరి రిసార్ట్.. పార్టీలో డ్రగ్స్ కలకలం, వెలుగులోకి కొత్త విషయాలు
- 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు దగ్ధం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
- హనుమకొండలో ఘోరం.. మద్యం మత్తులో స్నేహితుడిపై కత్తితో దాడి!
- Hyderabad: మందుబాబుల వీరంగం.. మాదాపూర్‌లో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి, అద్దాలు ధ్వంసం!
- Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?





