SGSTV NEWS online
CrimeTelangana

చెట్టుపై కనిపించిన అనుమానాస్పద కవర్.. ఏముందా అని ఓపెన్ చేయగా..



వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని గోవర్ధనగిరిలో పేలుడు కలకలం రేపింది. ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మేకల శేఖర్, రమణమోని మహేష్, ఎండి చాంద్ భాష ముగ్గురు వ్యక్తులు పశువులను మేపడానికి వెళ్లారు. సాయంత్రం సమయంలో గ్రామ శివారులోని ఊర చెరువు అలుగు సమీపంలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో గోవర్ధనగిరి నుంచి గోపాల దిన్నెకు వెళ్లే మార్గంలో పందుల షెడ్డు వద్ద ఒక చెట్టుపై అనుమానాస్పదంగా కవర్ కనిపించింది. దీంతో అందులో ఏం ఉంది… చెట్టుపై ఎవరు వదిలి వెళ్లారని ఆలోచనలో పడ్డారు. తర్వాత కవర్‌ను కిందికి దించి తెరిచి చూడగా అందులో కొన్ని గోళాకారంలో దారంతో చుట్టి ఉన్న వస్తువులు గుర్తించారు. అసలు ఏంటి ఇది ఎందుకు దారం చుట్టారని ముగ్గురిలో ఒకరైన మేకల శేఖర్ రెండు గోళాకార వస్తువులను తీసుకొని రాయిపై పెట్టి పగులగొట్టే ప్రయత్నం చేశాడు. ఒక్కసారికి భారీ శబ్ధంతో అది పేలిపోయింది. ఘటనలో శేఖర్ ఎడమచేయి తీవ్రంగా దెబ్బతిన్నది. తీవ్ర రక్తస్రావం జరగడంతో మిగిలిన ఇద్దరు కంగారుపడ్డారు. గాయపడిని శేఖర్‌ను 108 అంబులెన్స్ ద్వారా వీపనగండ్ల ప్రైమరీ హెల్త్ సెంటర్ కి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ అస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ శేఖర్ చేతిని పరిశీలించిన వైద్యులు హైదరాబాద్ లో ని గాంధీ అస్పత్రికి తరలించాలని సూచించారు.


నాటు బాంబులు కాదు…:

అయితే ఆ కవర్‌లో ఉన్నవి నాటు బాంబుల మాదిరిగా కనిపించడంతో అందరూ గ్రామంలో నాటు బాంబులు అంటూ దుమారం రేగింది. ఇక స్థానికుల నుంచి విషయం తెలియగానే ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మిగిలిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవి నాటు బాంబులు కాదని.. తక్కువ తీవ్రత కలిగిన పేలుడు పదార్థాలని వీపనగండ్ల ఎస్సై నరేశ్ స్పష్టం చేశారు. అడవి పందుల వేట కోసం గుర్తుతెలియని వ్యక్తులు వీటిని వాడుతున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి నాటు బాంబులు లేవని ఎవరూ అందోళన చెందవద్దని ఎస్సై నరేశ్ ప్రజలను కోరారు.

Also read

Related posts