భక్తి విశ్వాసం.. ఇవే ఇప్పుడు మోసగాళ్లకు ఆయుధాలుగా మారుతున్నాయి. స్వామీజీలమని చెప్పుకుంటూ ఇంటిలోకి అడుగుపెట్టి శాపం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటన కృష్ణాజిల్లాలో కలకలం రేపుతోంది. ఇలాంటి కేటుగాళ్ల ఉచ్చులో పడొద్దంటూ పోలీసులు వారిస్తున్నా.. అమాయకులు మోసపోతూనే ఉన్నారు. అసలేం జరిగిందంటే..
ఉయ్యూరు, మార్చి 23: కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలోని ఆకునూరు గ్రామంలో ఆదివారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికులను కలవరపరిచింది. భక్తి విశ్వాసాలను ఆయుధంగా మార్చుకొని కొందరు వ్యక్తులు ఓ వృద్ధురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆకునూరులో నివాసం ఉంటున్న మందాడ ప్రసాదరావు, మనీ దంపతుల ఇంటికి ఉదయం సమయంలో నలుగురు వ్యక్తులు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చారు. మంత్రాలు జపిస్తూ స్వామీజీలమని చెప్పుకుంటూ ఇంటిలోకి ప్రవేశించిన వారు.. మొదట భక్తి వాతావరణాన్ని సృష్టించారు. ఆ తర్వాత అసలు రూపం బయటపెట్టారు. నీ భర్త నాకు బాగా తెలుసు. మాకు ఆశ్రమం కూడా ఉంది. అందులో గోవుల సంరక్షణ కోసం వెంటనే లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బాధితురాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఆమె వద్ద అంత డబ్బు లేదని చెప్పిన ‘డబ్బు ఇవ్వకపోతే శపిస్తాం.. మీ కుటుంబానికి కష్టాలు వస్తాయి’ అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఆకస్మిక చర్యతో భయాందోళనకు గురైన బాధితురాలు చేతిలో ఉన్న కాడికి రూ.5000 వారికి ఇచ్చింది. కానీ అక్కడితో ఆగని ఆ వ్యక్తులు మరింత డబ్బు కోసం ప్రయత్నించారు. అదే సమయంలో బాధితురాలు మనీ మేనల్లుడు తోట్లవల్లూరు మండలంలోని బొడ్డపాడు నుంచి వచ్చిన వెంకట రామకృష్ణ అక్కడికి వచ్చాడు. పరిస్థితిని అర్థం చేసుకునే లోపే అతడి వద్ద నుంచి మరో వెయ్యి రూపాయలు వసూలు చేసి అక్కడి నుంచి జారుకున్నారు.
ఈ సంఘటనతో షాక్‌కు గురైన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు సంఘటనపై తక్షణం స్పందించారు. బాధితురాలిని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తులలో ఈ ఘటన ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగిపోతూ ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో, శాపం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అపరిచితులను ఇంట్లోకి అనుమతించకుండా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. స్వామీజీలమని చెప్పి ఇంటికి వచ్చే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం ఉన్న వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
Also read
- హారతి సమయంలో గంట మోగించని ఏకైక ప్రసిద్ధ దేవాలయం ఇదే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- తిరుమల శ్రీవారి శుక్రవారం అభిషేకం.. పునుగు తైలం వెనుక దాగి ఉన్న దివ్య రహస్యం ఇదే!
- Video: ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఐస్క్రీమ్ అందుకోబోయాడు.. క్షణాల్లోనే ఎవ్వరూ ఊహించని సీన్.. వీడియో చూడండి..
- Andhra: తరచూ అర్థరాత్రి వేళల్లో పోతున్న కరెంట్.. ఏంటా అని ఆరాతీస్తే మైండ్ బ్లాంక్ అయ్యే నిజం..
- పక్కా స్కెచ్.. ఏటీఎం డబ్బుతో పరారైంది తండ్రీకొడుకులే





