కన్నప్రేమే మృత్యుపాశం అయ్యింది. పదేళ్ల క్రితం భర్తను కోల్పోయి, కొడుకు దూరమైనా.. కూతురే లోకమని బతికిన ఆ తల్లికి.. ఆమె యముడిలా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన రమాదేవి మరణం మొదట ప్రమాదమని అందరూ భావించినా.. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసేసరికి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరిగిందంటే.?
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన రమాదేవి ఇళ్లలో పనిచేస్తూ జీవించేది. ఆమె భర్త పదేళ్ల క్రితమే చనిపోగా కొడుకు కూడా ఇంట్లోకి వాళ్లకి చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో రమాదేవి తన కూతురు లక్ష్మీతో కలిసి జీవించేది. లక్ష్మీని కొన్నేళ్ళ కిందట విజయవాడకు చెందిన శ్రీనివాసరావుకిచ్చి వివాహం జరిపించింది. అప్పటి నుండి సత్తెనపల్లిలో రమాదేవి ఒంటరిగానే నివసిస్తోంది. అప్పుడప్పుడు లక్ష్మీ ఆమె భర్త పిల్లలు రమాదేవి ఇంటికి వచ్చి పోతుండేవారు. అయితే ఈ నెల7న సాయంత్రం రమాదేవి ఇంటిలో నుండి ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. ఇంట్లో ఉన్న రమాదేవి మంచంపై మంటల్లో చిక్కుకొని కాలిపోయింది. అయితే అందరూ షార్ట్ సర్క్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
రమాదేవి కూతురు లక్ష్మీకి ఫోన్ చేసి తల్లి మరణ వార్త గురించి చెప్పారు. అయితే లక్ష్మీ స్పందించిన తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. తర్వాత కొద్దీ గంటల తర్వాత మరోసారి ఫోన్ చేశారు. ఈ సారి ఫోన్ స్విఛ్చాఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రమాదేవి మరణంపై పోలీసులకు అనుమానాలు పెరిగాయి. వెంటనే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా విజువల్స్ సేకరించారు. రమాదేవి ఇంటిలో ప్రమాదం జరగడానికి కొద్ది సమయం ముందే ఇంట్లో నుండి ఓ మహిళ బయటకు వెళ్లినట్లు ఈ సీసీ టీవీ విజువల్స్ ద్వారా గుర్తించారు.
ఇక వెంటనే విజయవాడ వెళ్లి లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో లక్ష్మీని ప్రశ్నించే సరికి అసలు విషయం చెప్పేసింది. తల్లి రమాదేవికి నిద్ర మాత్రలు ఇచ్చి ఆమె గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు లక్ష్మీ చెప్పింది. గత కొంతకాలంగా తల్లి కూతుర్లిద్దరికి కుటుంబ ఆస్తులతో పాటు ఇతర అంశాల్లోనూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్పారు. దీంతో రమాదేవిని లక్ష్మే చంపేసిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఎందుకు కన్న తల్లినే హత్య చేయాల్సి వచ్చిందో కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. స్థానికంగా రమాదేవి మరణం కలకలం రేపింది. కన్న కూతురే హత్య చేసిందని తెలిసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
Also read
- మహాశివరాత్రి నాడు అద్భుత గ్రహాల సంయోగం.. ఈ రాశులవారికి ఆకస్మిక ధన లాభం
- Maha Shivaratri 2026: శివుడికి ఈ దీపం వెలిగిస్తే ఇన్ని అద్భుతాలా? మీ కష్టాలన్నీ పటాపంచలు అవ్వాల్సిందే!
- మహాశివరాత్రి 2026: తేదీ, శుభ ముహూర్తం మరియు పూజా విధానం | Maha Shivaratri 2026
- మహా శివరాత్రి: త్రిశూలం నుంచి నంది వరకు… శివుని చిహ్నాల అర్థం, రహస్యాలు తెలుసా..?
- Andhra Pradesh: ఎటుపోతుంది సమాజం.. కన్నకూతురే కాలయముడిగా మారి తల్లిని దారుణంగా..





