ప్రేమ పేరుతో ఒక యువకుడు చేసిన పని ఒక యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. మహిళను నమ్మించి గొంతులో విషం పోసి, ఆసుపత్రిలో వదిలేసిన వెళ్లిపోయిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన బాధితురాలికి గతేడాది ఏప్రిల్‌లో వివాహమైంది. అయితే ఆమెకు ముందే పరిచయం ఉన్న భవానీశంకర్.. ఆమె వివాహం తర్వాత కూడా ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె భర్తకు ఫోన్ చేసి తప్పుడు మాటలు చెప్పి వారి మధ్య గొడవలు సృష్టించాడు. దీనివల్ల ఆ యువతి తన భర్తకు దూరమై తల్లిదండ్రుల వద్దకు చేరింది.
హైదరాబాద్ వెళ్లినా వదలని వేధింపులు
విజయవాడలో నర్సింగ్ కోర్సు చేస్తున్న సమయంలోనూ నిందితుడు ఆమెను వేధించడంతో రక్షణ కోసం తల్లిదండ్రులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. కానీ ఇన్స్టాగ్రామ్ ఐడీ ద్వారా ఆమె ఆచూకీ తెలుసుకున్న భవానీశంకర్, ఫోన్ చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి ఈ నెల 2న ఆమె విజయవాడకు రాగా, తన గదికి తీసుకెళ్లి అసలు స్వరూపం బయటపెట్టాడు.
అనుమానం.. బలవంతంగా పురుగుల మందు
ఈ నెల 3న సాయంత్రం యువతి ఫోన్ చెక్ చేసిన నిందితుడు.. అందులో మహేష్ అనే వ్యక్తి నంబర్ ఉండటంతో అనుమానంతో గొడవకు దిగాడు. బాధితురాలిని కొట్టి హింసించాడు. ప్రాణ భయంతో ఆమె రైల్వే స్టేషన్‌కు పారిపోవాలని చూసినా.. మళ్లీ బలవంతంగా గదికి లాక్కొచ్చాడు. అక్కడ తీవ్రంగా గొడవ పడి ఆమె నోట్లో బలవంతంగా పురుగుల మందు పోసి చంపడానికి ప్రయత్నించాడు. యువతి స్పృహ కోల్పోవడంతో భయపడిన నిందితుడు.. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, ఆమె తల్లికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




