ఏలూరు : ‘ఏలూరు సర్వజన ఆసుపత్రి పోస్టుమార్టం విభాగంలో అత్యంత దారుణమైన పరిస్థితి కొనసాగుతోంది. తమ ధన దాహానికి మృతదేహాలను సైతం వదలని పరిస్థితి నెలకొంది. జాలి, దయ అనేది లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం చేసేందుకు అక్కడి వైద్యులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టెడు బాధలో ఉన్న కుటుంబీకులు వైద్యుల తీరు చూసి ఇదేం దారుణమంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. నిరుపేదల కుటుంబీకులైతే అడిగినంత డబ్బు సమకూర్చలేక నానాయాతన పడుతున్న పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంతో పేరుగాంచిన ఏలూరు జిల్లా ఆసుపత్రి బోధనా ఆసుపత్రి (మెడికల్ కాలేజీ)గా మారిన తర్వాత అక్కడి పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు, పురుగుల మందు తాగిన కేసులు ఎక్కువగా ఏలూరు సర్వజన ఆసుపత్రికి వస్తుంటాయి. చికిత్స అందించినప్పటికీ ఒక్కోసారి పరిస్థితి వికటించి మరణిస్తున్నారు. అలా మృతి చెందిన కేసుల్లో పోస్టుమార్టం తప్పనిసరి అవుతోంది. మృతుడు స్వస్థలానికి సంబంధించిన విఆర్‌ఒ, సంబంధిత మండలానికి చెందిన పోలీసులు వచ్చి శవ పంచనామా చేసి రిపోర్ట్‌ను తయారు చేస్తారు. అనంతరం ఆసుపత్రిలోని వైద్యులు పోస్టుమార్టం చేయడం జరుగుతోంది. జిల్లా ఆసుపత్రిగా ఉన్నప్పుడు పోస్టుమార్టానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. బోధనా ఆసుపత్రిగా మారిన తర్వాత పరిస్థితి ఘోరంగా తయారైందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం చేసేందుకు చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచి రూ.ఐదు వేల వసూలు చేయడం అంతటా హాట్‌టాపిక్‌గా మారింది. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే పోస్టుమార్టం చేసేందుకు రాకుండా వైద్యులు మొరాయిస్తున్నట్లు మృతుని బంధువులు చెబుతున్న పరిస్థితి. ఆసుపత్రి లెక్కల ప్రకారం ప్రతినెలా 45 నుంచి 50 వరకూ పోస్టుమార్టాలు జరుగుతున్నాయి. ఒక్కో మృతదేహానికి రూ.ఐదు వేలు వసూలు అంటే దాదాపు రూ.2.50 లక్షలకుపైగా వసూళ్ల ప్రక్రియ సాగుతోంది. ఇదంతా యథేచ్ఛగానే సాగిపోతోంది. మామూలుగా అయితే పోస్టుమార్టం చేసిన తర్వాత మృతదేహాన్ని ప్యాక్ చేయడానికి చాప వంటి కొన్ని వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అందుకు సంబంధించి రూ. 1500 వరకూ ఖర్చవుతోంది. అక్కడి వరకూ ఇవ్వడానికి పెద్దగా ఇబ్బంది లేదు. పోస్టు మార్టం చేసే వైద్యులకు రూ.ఐదు వేలు ఎందుకివ్వాలన్న ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. డబ్బులు ఇవ్వకపోతే పోస్టుమార్టం ఆలస్యం కావడం, తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇవ్వరన్న భయంతో డబ్బులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది.
పోలీసులతో ఒత్తిడి చేసి వసూలు
పోస్టుమార్టం చేసే వద్ద వసూలు అంతా అక్కడికొచ్చిన పోలీసులతోనే వైద్యులు చేయిస్తున్నారంటూ చర్చ సాగుతోంది. ఏదైనా మృతదేహానికి సంబంధించిన ప్రక్రియలో ఎస్‌ఐ, లేకపోతే ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్ ఎవరో ఒకరు హాజరు కావాల్సి ఉంటుంది. అనేక పని ఒత్తిళ్ల కారణంగా కొన్నిసార్లు ఎస్‌ఐలు రాలేకపోతున్న పరిస్థితి కొనసాగుతోంది. చనిపోయిన కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసి ఇచ్చే బాధ్యత పోలీసులకే వైద్యులు అప్పగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవేళ పోలీసులు నిరాకరిస్తే ఎస్‌ఐను తీసుకురండని, లేకపోతే ఏదో ఒక కాగితం లేదంటూ ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులకు సైతం ఏంచేయాలో తెలీక పోస్టుమార్టం చేసే వైద్యులకు డబ్బులు ఇవ్వాలంటూ చనిపోయిన కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఇవ్వపోతే పోస్టుమార్టం ప్రక్రియ నిలిచిపోతుందన్న భయం కుటుంబీకులను వెంటాడుతోంది. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు రూ. లక్షల్లో వేతనాలు ఉంటాయి. అయినప్పటికీ మృతదేహాలకు పోస్టుమార్టంలో డబ్బులు వసూలు చేయడం అందరినీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మృతదేహం ప్యాక్ చేయడానికి రూ. రెండు వేలు, పోస్టుమార్టం చేసినందుకు రూ.ఐదు వేలు తప్పనిసరిగా కట్టాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. పోస్టుమార్టం చేసేవద్ద ఎవరికీ డబ్బులు ఇవ్వక్కర్లేదని బోర్డులు పెట్టి, ఎవరైనా డబ్బులు అడిగితే ఈ నెంబర్‌కు ఫిర్యాదు చేయండని అక్కడి అధికారులు ఎందుకు చేయడంలేదో అర్ధంకావడం లేదు. సామాన్య కుటుంబీలకు చెందిన వారైతే డబ్బులు కట్టలేకపోతున్నారు. దీంతో ఊళ్లో గ్రామ పెద్దలు డబ్బులు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. దీనిపై ఏలూరు సర్వజన ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ హనుమాన్ నాయక్‌ను డబ్బులు వసూలుపై వివరణ కోరగా సూపరింటెండెంట్ వచ్చాక తెలియపరుస్తామని, పోస్టుమార్టానికి డబ్బులు కట్టనవసరం లేదని ఆయన తెలిపారు.
Also Read
- నేటి జాతకములు 24 ఫిబ్రవరి, 2026
- కరీంనగర్ లో విషాదం: వారం వ్యవధిలో దంపతుల మృతి
- ఘోర ప్రమాదం: రెయిలింగ్లోకి దూసుకెళ్లిన కారు
- ఛీ.. ఛీ.. అసలు నువ్వు తల్లివేనా.. కన్న కుమార్తెకు నిద్రమాత్రలు ఇచ్చి ప్రియుడితో..
- వంశీ మాయలోడు అనుకోలేదు.. రెండో పెళ్లైనా ఏం పర్లేదులే అనుకుంది.. కట్ చేస్తే..





