SGSTV NEWS online
CrimeTelangana

Mahbubnagar: కూతురి కులాంతర ప్రేమ.. తట్టుకోలేక తండ్రి బలవన్మరణం.



కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించి వెళ్లిపోయిందనే మనస్థాపం తట్టుకోలేక మహబూబ్‌నగర్‌లో ఓ తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హన్మసానిపల్లిలో కలకలం రేపింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన కూతురిని తిరిగి తీసుకొచ్చినా, ఆమె ఇతర సామాజిక వర్గం యువకుడిని ప్రేమిస్తున్నట్టు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనతో ప్రాణాలు తీసుకున్నాడు.


కూతురు ఇతర సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించిందని మనస్థాపంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం హన్మసానిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  హన్మసానిపల్లి గ్రామానికి చెందిన కౌల్ల ఎల్లయ్య, అరుణ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక్కగానొక్క కూతురు సంతానం. కూతురు గౌతమి ఇంటర్మీడియట్ వరకు చదివి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 19న ఉదయం ఎవరికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం తల్లితండ్రులు బంధువుల ఇళ్లలో వెతుకుతున్నారు. ఈ క్రమంలో నవాబ్ పేట మండల కేంద్రంలో కొండాపూర్ గ్రామానికి చెందిన చందు అనే అబ్బాయితో గౌతమి తారసపడింది. వెంటనే కూతురు దగ్గరికి వెళ్లి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని వచ్చారు.  అలా చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్లావని అడిగారు. తాను చందును ప్రేమించాను అని… తననే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే అతనితో వెళ్లిపోయానని తల్లిదండ్రులకు తెలిపింది.

ఇక కూతురి కులాంతర ప్రేమ పట్ల తండ్రి ఎల్లయ్య తీవ్ర మనస్థాపం చెందాడు. అదే రోజు రాత్రి ఎల్లయ్య ఊర్లోకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రంతా కుటుంబ సభ్యులు ఎదురుచూసినా ఎల్లయ్య ఇంటికి రాలేదు. దీంతో మరునాడు ఉదయం ఎల్లయ్య కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. బంధువులు, స్నేహితులను ఆరా తీసారు. ఇక ఎల్లయ్య ఆచూకీ కోసం వెతుకుతూ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లారు. అక్కడ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఘటనపై ఎల్లయ్య భార్య అరుణ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కూతురు ఇతర సామాజిక వర్గం అబ్బాయిని ప్రేమించిందని మనస్థాపంతో తండ్రి ఎల్లయ్య మరణం గ్రామస్థులను కలచివేసింది. రోజు వ్యవసాయ పనులు చేసుకుంటూ కలివిడిగా ఉండే వ్యక్తి ఆకస్మిక మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

Also Read

Related posts