SGSTV NEWS online
Andhra PradeshCrime

అక్క కొడుకుని కాపాడే ప్రయత్నం.. అంతలోనే ముంచుకొచ్చిన మృత్యువు!



గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అక్క కొడుకును కాపాడేందుకు ప్రయత్నించి ఒక మహిళ తన ప్రాణాలను కోల్పోయింది. కుంటలో చేతులు కడుకున్నేందుకు వెళ్లి బాలుడు నీటిలో మునిగిపోగా.. బాలున్న రక్షించేందుకు మహిళ ప్రయత్నించింది. బాలుడిని బయటకు లాగే క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె నీటిలో పడిపోయి మునిగిపోయింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు తీసినా ఎలాంటి లాభం లేకపోయింది.

వినుకొండలో సంచార జీనవం సాగించే రాములు, ఎల్లమ్మలకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయికి పెళ్లైంది. రెండో కుమార్తె మల్లీశ్వరి తల్లిదండ్రుల వద్దే ఉంటూ మేకలు మేపుతుండేది. రాములు పెద్దమ్మాయి కొడుకు శివ కూడా మల్లీశ్వరికి తోడుగా మేకలు మేపడానికి వెళ్లేవాడు.. ఎప్పటి లాగే గురువారం కూడా మేకలు మేపుకుంటూ వినుకొండలోని గాయత్రి నగర్ చేరుకున్నారు. గాయత్ని నగర్ లోని ఒక కుంట వద్ద మధ్యాహ్న భోజనానికి ఆగారు. శివ భోజనం చేసిన తర్వాత కుంటలోకి దిగి చేయి కడుక్కునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే నీళ్లలోకి పడిపోయాడు. ఇది గమనించి మల్లీశ్వరి.. శివను కాపాడేందుకు కుంటలోకి దిగింది.

ఒడ్డునే ఉండి శివకు తన చున్నీ అందించింది. బలంగా బటకు లాగే ప్రయత్నం చేసింది. అయితే అలా లాగే క్రమంలోనే మల్లీశ్వరి కూడా కుంట నీళ్లలో పడిపోయింది. బయటకు వచ్చిన శివ.. మల్లీశ్వరి నీటిలో పడి మునిగిపోతుండటాన్ని గమనించి కేకలు వేశాడు. వెంటనే చుట్టు పక్కల ఉన్న వాళ్లు కుంట వద్దకు చేరుకున్నారు. కుంట పూర్తిగా నీళ్లతో నిండి ఉండటంతో తాడు సాయంతో మల్లీశ్వరిని రక్షించే ప్రయత్నం చేశారు. అలాగే పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు వచ్చేలోపు ఎలాగోలా మల్లీశ్వరిని అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. అయతే అప్పటికే కుంటలోని నీరు మింగేసిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇక ఒడ్డుకు చేర్చిన ఆమె నుంచి నీళ్లను కక్కించే ప్రయత్నం చేశారు స్థానికులు. తర్వాత శివ, మల్లీశ్వరిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మల్లీశ్వరి చనిపోయింది. శివ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.

అక్క కొడుకును కాపాడేందుకు ఏకంగా తన ప్రాణాలనే అర్పించిన మల్లీశ్వరి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ హృదయవిదారక ఘటనను చూసిన స్థానికులు చలించిపోయారు. మల్లీశ్వరిని కాపాడేందుకు శతధా ప్రయత్నించిన ఫలితం లేకపోయినట్లు స్థానికులు చెప్పారు. కుంటలో నీరు అధికంగా ఉండటంతో పడిన వెంటనే మల్లీశ్వరి నీళ్ళలో మునిగిపోయిందని శివ చెప్పాడు.

Also Read

Related posts