SGSTV NEWS online
CrimeNational

Delhi Blast: ఢిల్లీ పేలుడు నేపథ్యంలో ముంబై, యూపీ, హైదరాబాద్‌లలో హై అలర్ట్



దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన కారులో భారీ బ్లాస్ట్ సంభవించింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీమ్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.

ఢీల్లీ పేలుడు నేపథ్యంలో ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. మహారాష్ట్ర రాజధానిలోని ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను పెంచుతున్నట్లు భద్రతా సంస్థ వర్గాలు తెలిపాయి.  ఉత్తరప్రదేశ్,  డెహ్రాడూన్‌లోని అన్ని ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు.  సున్నితమైన ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడంతో పాటు తనిఖీలను పెంచాలని లక్నో ఉన్నతాధికారులు ఆదేశించారు. ఢిల్లీ పేలుడు తర్వాత, ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఇండో-నేపాల్ బోర్డర్ వెంబడి సరిహద్దు భద్రతా దళం (BSF)తో పాటు, స్థానిక పోలీసులను కూడా మొహరించారు. BSF, నిఘా విభాగం.. బహిరంగ నేపాల్ సరిహద్దును దాటే సందర్శకులను నిశితంగా పరిశీలిస్తున్నాయి.

ఢిల్లీలో జరిగిన పేలుడు తర్వాత రాజస్థాన్‌లోని భద్రతా సంస్థలను కూడా అప్రమత్తం చేశారు. అన్ని రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌లు, జిల్లా సూపరింటెండెంట్‌లు… సున్నితమైన పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని ప్రాంతాలను హై అలర్ట్‌లో ఉంచాలని డీజీపీ రాజీవ్ శర్మ ఆదేశించారు. సరిహద్దు జిల్లాలు, సున్నితమైన ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు పెంచారు. ఇటు హైదరాబాద్‌లోనూ పోలీసులు అలెర్ట్ అయ్యారు. పాత బస్తీ అంతటా గస్తీ పెంచారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఢిల్లీ పేలుళ్ల నేపధ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతాలో హై అలర్ట్ కొనసాగుతోంది.

ఢిల్లీలో ఏం జరిగింది…

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు దేశమంతా వణికింది. ఇప్పుడక్కడ అత్యంత భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఎటు చూసినా ఛిద్రమైన మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలే. సరిగ్గా 6.52నిమిషాలకు పేలుడు సంభవించింది. స్పాట్‌లో ఉన్నవారికి ఏం జరిగిందో అర్థంకాలేదు కానీ, భారీ పేలుడు జరిగినట్లు అర్థమయింది. వెంటనే ఎక్కడివారు అక్కడే ప్రాణభయంతో పరుగులు పెట్టారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ, చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి.

రెడ్‌పోర్ట్ ఏరియా సమీపంలోని మెట్రో స్టేషన్ గేట్‌-1పార్కింగ్ ఏరియాలో పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ జరిగిన పదినిమిషాల్లోనే అగ్నిమాపక వాహనాలు స్పాట్‌కు చేరుకున్నాయి. మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. కానీ అప్పటికే పేలుడు ధాటికి వాహనాలు తునాతునకలయ్యాయి. చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్నాయి. ముందుగా ఒకరే చనిపోయారనుకున్నారు. కానీ మంటలు ఆర్పేదాకా తెలియలేదు, ఇది భారీ విధ్వంసమని, ఒకటి, రెండు, మూడు, నాలుగు..అనుకుంటుగానే మరణాల సంఖ్య 8కి చేరింది. 20మందికిపైగా గాయపడ్డారు. ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు..



13ఏళ్ల తర్వాత ఢిల్లీని పేలుళ్లు వణికించాయి. బ్లాస్ట్ అయిన ప్లేస్‌ చూస్తే గుండెలు జలదరిస్తాయి. అంత భయానకంగా ఉందా స్పాట్. ఇంత శక్తివంతమైన పేలుడు జరిగిందంటే, ఏదో కుట్ర జరిగే ఉంటుందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో గేట్ -1 దగ్గర ఉన్న ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర రెడ్‌ సిగ్నల్ పడడంతో వెహికిల్స్ ఆగాయి. ఆగిన వెహికిల్స్‌లో ఒక వాహనంలో పేలుడు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. పార్కింగ్ ఏరియా కావడం, పెద్దగా జనసమ్మర్ధం లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది కానీ, లేకుంటే చరిత్రలో ఊహించని అతిభారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదంటున్నారు అధికారులు..

సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న వాహనంలో పేలుడు సంభవించిందని ఢిల్లీ పోలీసు చీఫ్ తెలిపారు.  చాందినీ చౌక్ మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ ఎకె మాలిక్ తెలిపారు. రాత్రి 7:29 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ పేలుడులో సమీపంలోని 22 వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి

Also Read

Related posts