ఆస్తి ఇవ్వలేదన్న కోపంతో ఓ కొడుకు దారుణానికి ఒడిగట్టాడు.. విజయనగరం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనంగా మారింది. బొండపల్లి మండలం కొండకిండాంలో కొడుకు.. తండ్రిని దారుణంగా చంపాడు.. 72 ఏళ్ల పెదమజ్జి నాయుడు బాబు అనే వృద్ధుడిని తన కన్న కొడుకు గణేష్ దారుణంగా హత్య చేశాడు. ఆస్తి తనకు అప్పగించాలని గత కొన్ని రోజులుగా పెదమజ్జి నాయుడు బాబుకు, ఆయన కుమారుడు గణేష్ కు మధ్య వివాదం సాగుతుంది. ఈ క్రమంలోనే గత పదిహేను రోజుల క్రితం ఓసారి ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో తండ్రికి కాలు విరగడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. తన అనారోగ్య చికిత్స కోసం కొంత డబ్బు అవసరం అయ్యింది. అయితే తనకు చికిత్స చేయించాలని పెద్ద మనుషుల ద్వారా కొడుకుకి సమాచారం ఇచ్చాడు తండ్రి. అందుకు కొడుకు గణేష్ ససేమిరా అనడంతో చేసేదిలేక కొంత భూమి అమ్మడానికి సిద్ధమయ్యాడు..
తండ్రి భూమి అమ్ముతున్న విషయం తెలుసుకున్న కొడుకు గణేష్ కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా తండ్రి అడ్డం తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు. గురువారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటికి చేరుకున్నాడు గణేష్. ఇంట్లో ఉన్న గునపం తీసుకొని బలంగా గుండెల మీద గుద్దాడు. నన్ను వదిలి పెట్టమని కాళ్లు పట్టుకొని వేడుకున్నా చనిపోయే వరకు పదే పదే కొట్టాడు. అప్పటికి ప్రాణం పోకపోవడంతో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి కిరాతకంగా హతమార్చాడు. చిన్ననాటి నుండి ఆడించి, పాడించి పెంచిన మమకారాన్ని కూడా పక్కన పెట్టి.. మానవత్వం మరిచి మృగంలా ప్రవర్తించాడు.
తండ్రి చనిపోయిన తరువాత తండ్రి మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు కొడుకు గణేష్.. అంతేకాకుండా.. సహజ మరణంగా చెప్పాలని కుటుంబసభ్యుల పై సైతం ఒత్తిడి చేశాడు. దీంతో తన తల్లితో పాటు ఇతర కుటుంబసభ్యులు కూడా వాస్తవాలు చెప్పడానికి భయపడ్డారు. అయితే జరిగిన వాస్తవం తెలుసుకున్న గ్రామస్తులు గుర్తు తెలియని వ్యక్తి వలె పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడు గణేష్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!