SGSTV NEWS
CrimeTelangana

Ganesh Chaturthi : ఇదెందయ్యా గణపయ్యా…చందా ఇవ్వలేదని.. 4 కుటుంబాలు కుల బహిష్కరణ


జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన కలకలం రేపింది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని ఎస్సీ కులానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడం వివాదానికి దారితీసింది. 

Ganesh Chaturthi : వినాయక నవరాత్రులు అంటేనే అందర్నీ ఏకం చేసే ఉత్సవాలు అంటారు. కుల, మతాలకు అతీతంగా అందరూ కలిసి ఐక్యంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించుకుంటాం. నవరాత్రులన్నీ రోజులు చిన్న, పెద్ద అంతా మరిచిపోయి  భక్తి, భావనలో మునిగిపోయి సంతోషంగా గడపడానికే వేడుకలని చెప్పుకుంటాం. కానీ, ఆచరణకు వచ్చే సరికి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా జరుగుతుంటాయి. నగరాల్లో పెద్దగా పట్టింపులు ఉండక పోయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నేటికి కొన్ని చోట్ల కులం, డబ్బు ప్రజల మధ్య అంతరాలను సృష్టిస్తూనే ఉంది. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో అనాగరిక ఘటన కలకలం రేపింది. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదని ఎస్సీ కులానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు కుల బహిష్కరణ చేయడం వివాదానికి దారితీసింది.  గ్రామానికి చెందిన గాలిపెల్లి అరుణ్, గంగ లచ్చయ్య, అంజి, సూర్య వంశీల కుటుంబాలను కుల పెద్దలు కులం నుంచి బహిష్కరించారు. ఆ కుటుంబాలతో ఎవరు మాట్లాడకూడదని ఊర్లో డప్పు చప్పుల్లతో దండోరా వేయించారు. వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 25 వేల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. ఆ కుటుంబాలతో అ కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లు సమాచారం అందించిన వారికి 5 వేల నజరానా కూడా ప్రకటించారు.


వివరాల ప్రకారం..గ్రామంలో  ఎస్సీ కులానికి చెందిన వారు చందాలతో గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. నవరాత్రులు ముగిసిన తర్వాత గణేష్ విగ్రహం నిమజ్జనం పూర్తయిన వెంటనే ఉత్సవాల నిర్వాహకులు, గ్రామ కుల పెద్దలు గాలిపెల్లి అరుణ్, గంగ లచ్చయ్య, అంజి, సూర్యవంశీలను ఒక్కొక్కరిని రూ.1,116 చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఆ మొత్తం చెల్లించలేమని వారు తేల్చి చెప్పారు. దీంతో  వారిని కుల బహిష్కరణకు గురి చేశారు.  అంతేకాక కేవలం గణేష్ చందా ఇవ్వలేదని చెప్పి.. వినాయకుడి వద్ద కొబ్బరికాయ కొట్టకూడదని తేల్చి చెప్పారు. పైగా చందా ఇవ్వని ఆ కుటుంబాలను వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నియమం అక్షరాలా అమలు కావడంతో, బహిష్కరణకు గురైన కుటుంబాలు తీవ్రమైన సామాజిక ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ ఘటన గ్రామాన్ని మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది.  గ్రామ పెద్దల ఈ అసాధారణ నిర్ణయం మానవ హక్కులకు పూర్తిగా విరుద్ధంగా ఉందని, ఇది సమాజంలో నివసించే వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనిపై చేసేదేమి లేక బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also read

Related posts

Share this