Vishakha Ram Mandir: మొన్న వెంకన్న గర్భ గుడి సెట్ వేసి ఏకంగా నాన్ వేజ్ హోటల్ వ్యవహారం. నేడు.. విశాఖలో అయోధ్య రామమందిర నమూనా సెట్ తో కోట్లు దండుకుంటున్న మరో వివాదం. రాములోరి పేరిట దండుకుంటోన్న ఈ స్కాములోర్లు ఎవరు? విశాఖ బీచ్ పై వెలసిన నమూనా రామ మందిర వివాదమేంటి? దీని వెనక దాగిన అసలు నిజాలేంటి? హిందూ సంఘాల వాదనేంటి? నిర్వాహకుల సమాధానమేంటి? అయినా భక్తి పేరిట ఈ బిజినెస్ ఏంటి?
విశాఖ బీచ్లో అయోధ్య రామ మందిర సెట్
భక్తి పేరిట ఈ బిజినెస్ ఏంటన్న ఆవేదనఇదిగో ఈ రామమందిరాన్ని చూశారా? అచ్చం.. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని తలపిస్తోంది కదూ? ఇది అయోధ్య రామ మందిరంలా ఉన్నా.. ఇదున్నది మాత్రం విశాఖ బీచ్ లో. అదేంటి అని చూస్తే అక్కడి వరకూ వెళ్లలేని వారి కోసం.. ఇక్కడొక నమూనా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. ఇందులో దాగిన అసలు మతలబు ఏంటంటే.. ఈ రామ మందిరాన్ని దర్శించుకోవడం అంత తేలికేం కాదు.. భారీ ఎత్తున డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇందులోనే కళ్యాణోత్సవ వివివాదం. ఏకంగా 2999 రూపాయల మేర చెల్లించి మరీ రసీదు తీసుకోవల్సి ఉంటుంది.
ఆలయ సెట్ వేసి పెద్ద ఎత్తున దండుకోవడం
అంత దూరం వెళ్లి బాలరాముడ్ని దర్శించుకోలేని వారు మహత్తర అవకాశంగా భావించిన మాట నిజమే కానీ.. ఈ నమూనా ఆలయ నిర్వాహకులపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. వీటిలో మొదటిది ఇక్కడ నమూనా ఆలయం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున దండుకోవడం. రెండో వివాదం భద్రాచలం దేవస్థానం నుంచి పూజారులను రప్పించి కళ్యాణోత్సవం నిర్వహిస్తామనడం. ఇక మూడోది.. నమూనా ఆలయం పేరిట తనను మోసం చేశారంటూ కాకినాడకు చెందిన ఒక బాధితుడు వెలుగులోకి రావడం. దీంతో ఇటు హిందూ సంఘాలు అటు భక్తులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీస్కోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయ్.
ఆగమ శాస్త్ర విరుద్ధం, దైవ ద్రోహంతో సమానం హిందూ సంఘాలు
ఈ నమూనా ఆలయంపై హిందూ సంఘాలైతే భగ్గు మంటున్నాయి. ఇది ఆగమ శాస్త్ర విరుద్ధమనీ.. మరీ ముఖ్యంగా దైవ ద్రోహంతో సమానమనీ చెప్పుకొచ్చారు. ధర్మం పేరిట సాగించే అధర్మ కార్యమని కూడా మండి పడ్డారు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి అయోధ్యలో రామ మందిరం నిర్మించారు. అక్కడి వరకూ వెళ్లకుండా భక్తులను ఇక్కడే ఆపడం ఒక తప్పు అయితే, ఆ రామాలయం పేరిట డబ్బు వసూళ్లు సాగించడం మహాపరాధంగా చెబుతున్నారు వీరు. నిజంగానే భక్తుల దర్శనార్ధం వేసే సెట్ అయితే పరిస్థితి మరోలా ఉండేదని.. భారీ ఎత్తున డబ్బు వసూళ్ల కోసమే ఇలా చేయడం సరికాదని అంటున్నారు. ధర్మానికే విగ్రహంలాంటి రాముడి పేరిట ఈ అధర్మం.. అస్సలు మంచిది కాదంటారు వీరు. అంతే కాదు ఇప్పటి వరకూ రెండు నెలలు గడిచాయనీ.. ఈ మధ్య కాలంలో సుమారు ఐదు లక్షల మంది వరకూ ఈ నమూనా ఆలయాన్ని సందర్శించినట్టుగా తమకు రిపోర్టులు అందుతున్నాయని అంటున్నారు హిందూ సంఘాల వారు. ఈ నమూనా ఆలయ పేరిట సాగించిన వసూళ్ల మొత్తం.. కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని.. ఇది ఆ అయోధ్య రామయ్యకు చేస్తున్న ద్రోహంగా తాము భావిస్తున్నట్టు చెబుతున్నారు వీరు.
సీపీతో ఫోటోలు దిగి మిగిలిన అనుమతులు పొందినట్టు ఆరోపణ
బేసిగ్గా అయితే ఈ రామాలయ నమూనాకు ఆగస్టు 4 వరకూ పోలీసు వారి అనుమతి ఉంది. అయితే విశాఖ సీపీతో ఫోటోలు దిగిన నిర్వాహకులు వీటిని చూపించి మిగిలిన అన్ని శాఖ అనుమతులు తీసుకున్నట్టుగా ఆరోపిస్తున్నారు. విశాఖలో ఇది గ్రాండ్ హిట్ కావడంతో హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి.. ఇక్కడా ఈ సెట్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ మొత్తం సెట్టింగ్ కి కీలక సూత్రధారి తునికి చెందిన గరుడ- దుర్గా ప్రసాద్ కాగా.. ముంబైకి చెందిన పీవీ శెట్టి ద్వారా పెట్టుబడి పెట్టించినట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహారంలో మరొక వివాదం కూడా వెలుగులోకి వచ్చింది. అయోధ్య నమూనా రామ మందిర నిర్వాహకుల చేతిలో తాను దారుణంగా మోసపోయినట్టుగా కాకినాడ జిల్లా ఏలేశ్వరానికి చెందిన గణేష్ ఒక వీడియో విడుదల చేశాడు. 32 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే.. 50 లక్షల రూపాయలు రిటర్న్ వస్తుందని నమ్మించి మోసం చేసినట్టు వాపోతున్నాడితడు. నమ్మి డబ్బులిస్తే తిరిగివ్వకుండా పారిపోయారనీ.. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కట్ చేయడం, బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భద్రాచల దేవస్థాన పండితులు
ఇదే వివాదానికి సంబంధించి భద్రాచలం ఆలయ పండితులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే, భద్రాచలం ఆలయ పండితుల చే.. అయోధ్య రాముడి కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రచారం చేయడంపై వీరు మండి పడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఇలాంటి ప్రచారం చేయడమేంటన్నది వీరి ప్రశ్న. విశాఖ కలెక్టర్, సీపీ వీరికెలా అనుమతులిస్తారంటూ వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం నిర్మించిన గరుడ సంస్థకు చెందిన నిర్వాహకులు ఇందులో తమ తప్పు లేదని అంటున్నారు. తామేమీ తప్పుడు ప్రచారం చేయలేదని చెబుతున్నారు. కావాలనే ఎవరో తమ పేరిట తప్పుడు పాంప్లెంట్లు ప్రింట్ చేశారని అంటున్నారు. తాము కొండవీటి రామలింగేశ్వర శర్మ అధ్వర్యంలో జరిగే ఈ కళ్యాణోత్సవంలో భద్రాచలం నుంచి తీసుకొస్తున్న బ్రాహ్మణ బృందం పాల్గొంటుందని మాత్రమే తాము చెప్పాం తప్ప- భద్రాచల దేవస్థానం నుంచి అని తాము చెప్పలేదంటున్నారు వీరు.
మొన్న నాన్వెజ్ హోటల్లో వెంకన్న సెట్
నిర్వాహకులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. దీంతో వీరిపై తప్పక చర్యలు తీసుకుంటామని అంటున్నారు అధికారులు. దేవుడి పేరిట ఈ దారుణాలేంటి? ఒక వేళ ఏదైనా ఆలయ నమూనా వేసినా.. అందుకు ఉచిత దర్శనం వంటి ఏర్పాట్లు చేయాలి కానీ ఇలా ధార్మిక కార్యక్రమాల పేరిట దండుకోవడమేంటన్నది భక్తుల ఆవేదనగా తెలుస్తోంది. మొన్నటికి మొన్న ఒక నాన్ వెజ్ హోటల్ ల్లో వెంకన్న గర్భగుడి సెట్ వివాదం మరచి పోక ముందే.. ఈ రాములోరి వివాదం వెలుగులోకి రావడంతో.. భక్తి పేరిట సాగుతున్న ఈ బిజినెస్ వ్యవహారమేంటో అర్ధం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు.
కలియుగ దైవం ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారంటే నిత్యోత్సవ- వారోత్సవ- మాసోత్సవ- బ్రహ్మోత్సవ అంటూ అత్యంత పరమ పవిత్రంగా పూజలు నిర్వహిస్తుంటారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ చిన్న విషయమైనా సరే పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంది. ఇక్కడి పవిత్రతే అతి పెద్ద ప్రాధాన్యతాంశం. వేకువ జాము సుప్రభాత సేవ నుంచి రాత్రి పవళింపు సేవ వరకూ ప్రతిదీ ఆగమ శాస్త్రానుసారమే జరుగుతుంది. ఇక్కడి నియమ నిష్టలతో కూడుకున్న క్రతువులే లోకానికి శ్రీరామరక్షగా భావిస్తారు. అలాంటి శ్రీవారి ఆలయం సెట్ వేస్తే వేశారు. ఒక నాన్ వెజ్ హోటల్ కోసం ఏకంగా జయవిజయులతో కూడిన గర్భ గుడి సెట్ వేయడమా? అన్నది అతి పెద్ద వివాదంగా మారింది. మీ స్వార్ధానికి స్వామి వారి ప్రతిష్టకు భంగం కల్పించడమా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
శ్రీవారి గుండు నుంచి లడ్డూ వరకూ ప్రతిదీ ప్రత్యేకం
డిమాండ్లు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులచే నీరాజనాలందుకునే శ్రీవారంటే ప్రపంచ ప్రఖ్యాతం. ఇక్కడి గుండు నుంచి లడ్డూ వరకూ ప్రతిదీ ప్రత్యేకమే. ఆపై స్వామివారికి నివేదించే ప్రసాదాల సంగతి సరే సరి. ఆ జాబితా ఎంత పెద్దగా ఉంటుందో అంతటి పవిత్రంగానూ ఉంటుంది. పులిహోర-చక్రపొంగలి- దద్దోజనం- వడ- అంటూ అన్నీ పూర్తి శాఖాహారానికి చెందినవే అయి ఉంటాయి. అలాంటి స్వామి వారి గర్భ గుడి సెట్ ఒక హోటల్లో వేస్తే మరెంత పరమ పవిత్రంగా ఉండాలి? కానీ విశాఖ హైవే పై వెలసిన రాయుడు అనే ఈ హోటల్లో మిలటరీ ఐటెమ్సే ఎక్కువ కనిపిస్తాయి.
తిరుమల తెలుగు రాష్ట్రంలో వెలయడంతో..
తిరుమల శ్రీవారు కొలువైన ఇల వైకుంఠం.. తెలుగు రాష్ట్రాల్లో వెలియడంతో.. తెలుగు వారు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం పూట నాన్ వెజ్ తినరు. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా హోటళ్లలో కూడా శనివార నియమం పాటిస్తారు. కొందరు మాంసాహార ప్రియులు శనివారం అర్ధరాత్రి వరకూ వేచి ఉండి.. ఎప్పుడైతే అర్ధరాత్రి 12 గంటలవుతుందో అప్పుడు నాన్ వెజ్ తినే వారున్నారంటే పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి శ్రీవారు ఎక్కడుంటే ఆ పూట శనివారమే. ఆ రోజు ముక్క ముట్టకుండా నిష్టగా ఉండాల్సిందే అంటారు కొందరు భక్తులు. అలాంటి భక్తుల మనోభావాలతో ఆడుకోవడంలో భాగమా అంటూ.. ఇక్కడ గర్భగుడి సెట్ వేయడం మాత్రమే కాకుండా.. నాన్ వెజ్ వంటలు వండటంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. భక్తజనులు.
కలియుగ దైవం మహత్యం అపవిత్రం చేయడమే హిందూ సంఘాల
ఇక్కడి శ్రీవారి ఆలయ నమూనా అంత స్పష్టంగా ఉంటుందంటే.. గర్భగుడిలో శ్రీవారు అచ్చం అలాగే ఉండటం మాత్రమే కాదు.. ద్వారపాలకులైన జయ విజయులు, బంగారు వాకిలి, కులశేఖర పడి వంటి వివరాలతో కూడిన ఆలయాన్ని అచ్చు గుద్దినట్టు పొందు పరచడం.. అది కూడా ఒక నాన్ వెజ్ హోటల్లో.. ఎంత అపరాధం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తజనులు. ఏంటీ వైపరీత్యం? ఇలా చేయడం కరెక్టేనా? అంటూ నిలదీస్తున్నారు హిందూ సంఘాల వారు సైతం. ఒక రకంగా చెబితే ఇది సాక్షాత్ ఆ కలియుగ దైవం మహత్యాన్ని అపవిత్రం చేయడమే. ఆ శ్రీవారి ప్రతిష్టను భంగ పరచడమే అన్నది వీరి ఆవేదనగా తెలుస్తోంది. టీటీడీ కూడా ఒక శ్రీవారి ఆలయ నమూనా తయారు చేసింది. అక్కడ నిజ గర్భాలయంలో జరిగే క్రతువులు కనులారా చూడలేని వారి కోసం ఇక్కడంటూ ఒక సెట్ వేశారు. అక్కడ గర్భాలయంలో ఏం జరుగుతాయో అలాంటి అభిషేకం, తదితర పూజాధికాలు ఇక్కడా చేసి చూపిస్తారు. ఇందు కోసం ఈ నమూనా ఆలయాన్ని నిర్మించారు. అలాంటి ఆలయాన్ని భక్తి పూర్వకంగా వేయడం వేరు. తమ హోటల్ కి కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం వేయడం వేరు. భక్తిలో ఈ కమర్షియల్ యాంగిల్ ఏంటన్న కోణంలో తీవ్రంగా విరుచుకుపడుతున్నారు కొందరు శ్రీవారి భక్తులు.
మిలటరీ హోటల్ ప్రచారం కోసం శ్రీవారి స్వర్ణ శోభను వాడ్డమా?
కొందరు భక్తులు తమ తమ గృహ, వ్యాపార స్థలాల్లో ఇలాంటి నమూనా విగ్రహాలు పెట్టుకుంటారు. కాదనడం లేదు. ఎప్పుడైతే ఇలాంటి నమూనా విగ్రహం పెడతారో.. ఆ విగ్రహానికి కూడా తగిన నివేదనలు చేయాల్సి ఉంటుంది. అంతే కాదు ఆయా విగ్రహాలకంటూ చేయాల్సిన పూజలు సైతం సూచిస్తారు పండితులు. ఇవేవీ లేకుండా శుద్ధ శాఖాహార నివేదనలు స్వీకరించే దేవుడి ముందు మాంసాహారం వండి వార్చడానికన్నా మించిన మహాపరాధం లేదంటారు పండితులు. ఈ హోటలే పెద్ద శ్రీవారి ఆలయం అన్నట్టు.. గేటు బయట జయ విజయులతో పాటు ఆలయంలో శ్రీవారి ఆయుధమైన సుదర్శన చక్రంతో సహ ఇక్కడ పూసగుచ్చినట్టు తీర్చిదిద్దడం పట్ల చాలా పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాదు.. స్వామి వారి మెడలో ఉండే అలంకరణలు సైతం అచ్చం శ్రీవారి మూలవిరాట్టును తలపించడం కరెక్టు కాదని అంటారు భక్తులు. మీ వ్యాపారం కోసం శ్రీవారి ప్రపంచ ప్రఖ్యాతిని అడ్డు పెట్టుకోవడం సరికాదంటారు. మాములుగా శ్రీవారంటేనే స్వర్ణాలంకార భూషితులు. ఎవరైనా సరే ఆ ఆకర్షణలో పడి పోవల్సిందే. దాన్ని తమ మిలటరీ హోటల్ ప్రచారం కోసం శ్రీవారి స్వర్ణ శోభను వాడాలని చూడ్డం ముమ్మాటికీ నేరంగానే పరిగణిస్తున్నారు శ్రీవారి భక్తులు.
స్వలాభం కోసం శ్రీవారి బ్రాండ్ వాడ్డం తప్పు- శ్రీవారి భక్తులు
సాధారణంగా ఆలయాలున్నది ధార్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం. తిరుమలలో శ్రీవారి ఆలయంలోనూ వివిధ రకాల సేవలకు వివిధ రకాల ధరలు వసూళ్లు చేస్తారు. కానీ ఆ మొత్తం డబ్బులను తీసుకెళ్లి వివిధ ప్రజా కార్యక్రమాలకే వెచ్చిస్తారు. ఉదాహరణకు శ్రీవాణి దర్శన టికెట్టు ధర 10 వేల 500 రూపాయలుంటుంది. అయితే ఈ మొత్తం ద్వారా పురాతన ఆలయాల జీర్ణోద్దరణ వంటి మంచి పనులు నిర్వహిస్తుంటారు. విద్యా, వైద్య సేవల కోసం ఈ సొమ్ము వినియోగిస్తుంటారు. శ్రీవారి ఆలయంలో కూడా భారీ ఎత్తున వసూళ్లు చేస్తారన్న ఆలోచన కొద్దీ.. స్వలాభం కోసం ఇలాంటి చర్యలకు సాహసించడం నేరంగా పరిగణించాలని అంటారు శ్రీవారి భక్తులు. ఈ హోటల్ బాగోతాన్ని గుర్తించిన కొందరు టీటీడీ ఈవో, చైర్మన్ లకు ఫిర్యాదు చేశారు. ఈ ఫోటోలు వీడియోలతో సహా పూర్తి సమాచారం అందజేశారు. శ్రీవారంటే బేసిగ్గా అదొక బ్రాండ్. ఒక వేళ ఆయన రూపాన్ని ఆ తరహా ఆలయాలను నిర్మించదలుచుకున్న వారు తగిన అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. టీటీడీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ తిరుమల పోలిన ఆలయాల నమూనాను.. తమ వ్యాపార లాభాల కోసం వాడుకోవడం సరి కాదని.. ఇలాంటి వారు మరి కొందరు వెలుగులోకి వచ్చేలోగా.. కఠిన చర్యలు తీస్కోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయ్.
ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేస్తే.. ఇది వేయితలలు వేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయ్. గతంలో మన దేవీ దేవతల పెయింటింగులపై జరిగిన చర్చ గురించి తెలిసిందే. ఇక విదేశాల్లో మన దేవుళ్లకు సంబంధించిన రూపాయలను అనుచితంగా వాడ్డంపై వచ్చిన విమర్శలు విధితమే. ఇవేవీ గుర్తించకుండా స్వామి వారి భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి చర్యలకు పాల్పడ్డమేంటన్నది శ్రీవారి భక్తుల ప్రశ్న. ఇలాంటి ఆగడాలను అరికట్టడానికి టీటీడీ దృష్టి సారించాలన్న సలహా సూచనలు అందుతున్నాయ్. ఒక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి.. ఇలంటి వారిని కట్టడి చేయాలని సూచిస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025