SGSTV NEWS
CrimeTelangana

Telangana News: దారుణం.. ప్రశ్నించినందుకు లారీ ఎక్కించి చంపాడు!



ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనం నడపడమేకాకుండా ఓ కారును ఢీ కొట్టాడు. కారులోని ప్రయాణికులు భయాందోళనలకు గురైయ్యారు. ఇందేటని ప్రశ్నించిన వ్యక్తికి సదరు లారీ డ్రైవర్ దురుసుగా సమాధానం చెప్పడమేకాకుండా లారీని అతడిపైకి ఎక్కించాడు.. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు..

మెదక్, జులై 24: మెదక్ జిల్లా 44వ జాతీయ రహదారిపై దారుణం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. కారును ఢీకొట్టడమే కాకుండా ప్రశ్నించిన ఒక వ్యక్తి పై నుంచి లారీ ఎక్కించాడు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామానికి చెందిన గల్వా సత్తిరెడ్డి (45) అనే వ్యక్తి హైదరాబాద్లో నివాసం ఉంటూ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. కామారెడ్డి జిల్లా తిప్పాపూర్‌లో బుధవారం తమ బంధువులు చనిపోతే అంత్యక్రియలకు వెళ్లాడు. తన అక్కతో పాటు ముగ్గురు అన్నదమ్ములు కలిసి కారులో అంత్యక్రియలకు వెళ్లి తిరిగి హైదరాబాద్ వెళుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి మండలం వల్లూరు శివారులోకి వచ్చేసరికి అతివేగంగా వచ్చిన ఒక లారీ డ్రైవర్ మొదట కారును ఓవర్టేక్ చేస్తూ కారును ఢీ కొట్టి పరార్ అయ్యాడు.

ఇదే క్రమంలో లారీని వెంబడించి కొద్ది దూరంలో లారీని ఆపేసి డ్రైవర్ ను ప్రశ్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా డ్రైవర్ ఆవేశానికి లోనై సత్తిరెడ్డిపైకి లారీ ఎక్కించాడు. దీంతో సత్తిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న లారీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు సత్తిరెడ్డికి భార్య, రెండేళ్ల వయసు గల పాప ఉన్నట్లు బంధువులు తెలిపారు

Also read

Related posts

Share this