అచ్చంపేట: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి తన కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వర్లు నాయక్ తన కుటుంబసభ్యులతో కలిసి మూడునెలల క్రితం ఎర్రబాలెం వచ్చాడు. గొర్రెలు, మేకలు మేపుతూ వారు జీవనం సాగిస్తున్నారు. పొలాల్లోనే తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. వెంకటేశ్వర్లు నాయక్కు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య కోటేశ్వరమ్మతో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి పెద్దకుమారుడు మంగ్యానాయక్ (19)తో పాటు మరో కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం కోటేశ్వరమ్మతో వెంకటేశ్వరనాయక్ విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రమీల అనే మహిళను వివాహం చేసుకున్నాడు.
మొదటి భార్య కుమారుడు మంగ్యానాయక్ తండ్రి వద్దనే ఉంటున్నాడు. ఆస్తిలో వాటా సొమ్ము ఇవ్వాల్సి వస్తుందనే కారణంగా పది రోజుల క్రితం కుమారుడిని తండ్రి చంపేసి.. మృతదేహాన్ని కాలువలో పూడ్చేశాడు.
మంగ్యానాయక్ బంధువులు ఈ విషయాన్ని తెలుసుకుని క్రోసూరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు వెంకటేశ్వర్లు నాయక్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ క్రమంలో మొదటి భార్య కోటేశ్వరమ్మ, బంధువులు ఎర్రబాలెం చేరుకున్నారు. వెంకటేశ్వర్లు నాయకన్ను అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో సీఐ సురేశ్ను వారు అడ్డగించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత మృతదేహాన్ని వెలికితీయడంతో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.
పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025